Aswapuram: ఆధునిక టెక్నాలజీతో భూ రీ సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్ అంకిత్!

Aswapuram: ఆధునిక సాంకేతికతతో భూ రీ సర్వేను వేగవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఆదేశం. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లిలో రోవర్లు, కేఎంఎల్ ఫైళ్లతో సాగుతున్న సర్వే తనిఖీ.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 11 Sept 2026 6:57 PM IST
Aswapuram
X

Aswapuram: ఆధునిక టెక్నాలజీతో భూ రీ సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్ అంకిత్!

అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారి పల్లి గ్రామంలో భూ రీ సర్వేలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి భూ సరిహద్దులను కచ్చితంగా నిర్ధారిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.

అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోవర్, ట్యాబ్ పరికరాలతో చేపడుతున్న డిజిటల్ సర్వే ప్రక్రియను పరిశీలించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. డిజిటల్ విధానంలో సర్వే నిర్వహించడం వల్ల సమయం, సిబ్బంది ఆదా కావడంతో పాటు ట్యాబ్‌లో నమోదైన సమాచారాన్ని నేరుగా కంప్యూటర్, ఆటోక్యాడ్‌లోకి మార్చుకునే అవకాశం ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

అమ్మగారిపల్లి, కుమ్మగూడెం పరిధిలో కాడస్ట్రల్ మ్యాపులు, పాత రెవెన్యూ రికార్డుల ఆధారంగా సుమారు 1,900 ఎకరాలకు పైగా భూముల సరిహద్దులను నిర్ధారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 1920ల నాటి ఫసలీ రికార్డులతో పాటు బూర్గంపాడు తాలూకాకు సంబంధించిన పాత రికార్డులను పరిశీలిస్తున్నట్లు వివరించారు.

మూడు తరాలుగా భూములను అనుభవిస్తున్నప్పటికీ రికార్డుల్లో ఉపవిభజనలు నమోదు కాకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి వరదలు, భూమి కోతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పాత భూ సరిహద్దులు మారిపోయాయని, సీతారామ ప్రాజెక్టు పరిసరాల్లో కొన్ని చోట్ల సుమారు 250 మీటర్ల మేర మార్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు వివరించారు. 57/1 తదితర సర్వే నంబర్లలో నీట మునక, ఇసుక మేటల కారణంగా పాత భూ గుర్తులు కనుమరుగైనట్లు తెలిపారు.

కేఎంఎల్ ఫైళ్ల ఆధారంగా సుమారు 7.91 కిలోమీటర్ల మేర సరిహద్దులను గుర్తిస్తున్నామని, రోజుకు సుమారు 2 కిలోమీటర్ల చొప్పున సర్వే నిర్వహించి 2 నుంచి 4 రోజుల్లో పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పాత రికార్డులను సమగ్రంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు భూములపై స్పష్టత కల్పించాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు తమ ప్రాంతంలో రహదారి నిర్మించాలని కలెక్టర్‌ను కోరగా, అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ సీఎస్‌ఆర్ నిధులతో అవసరమైన మేరకు రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం తహసీల్దార్ సూర్యప్రకాష్, సర్వే అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA