Bhadradri Kothagudem: ఏఐఎస్ఎఫ్ కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తత!
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించిన ఏఐఎస్ఎఫ్. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలకై డిమాండ్.
Bhadradri Kothagudem: ఏఐఎస్ఎఫ్ కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తత!
Bhadradri Kothagudem: పెండింగ్ స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి,
విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి
ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని తదితర డిమాండ్లతో జిల్లా కలెక్టరేట్ ఎదుట అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి, ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ విమర్శించారు.
విద్యార్థుల హక్కులను కాలరాస్తూ, ప్రభుత్వ విద్యను బలహీనపరిచే విధానాలను కొనసాగిస్తే విద్యార్థుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, "విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వ పతనం తప్పదని" హెచ్చరించారు.
ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రోజురోజుకూ సంక్షోభంలోకి నెట్టబడుతోందని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల కొరత, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల లేమి కారణంగా నాణ్యమైన విద్య దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి వెంటనే పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యా రంగానికి దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు.
ఈ పరిస్థితిని అరికట్టేందుకు తెలంగాణలో ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఫీజులపై ప్రభుత్వం కఠిన నియంత్రణ తీసుకురావాలని డిమాండ్ చేశారు.
విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో సమర్థవంతంగా అమలు చేయాలని, పేద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొన్నారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యా రంగాన్ని గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అజిత్ డిమాండ్ చేశారు.
ధర్నాలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారని.. ధర్నా విజయవంతమైందన్నారు.
ఒకానొక దశలో విద్యార్థులు కలెక్టరేట్ ప్రధాన గేటును తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ఏఐఎస్ఎఫ్ నాయకులకు మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కొద్ది మంది ఏఐఎస్ఎఫ్ నాయకులు జండాలు చేత పట్టి గేటు పైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏవో కృష్ణ ప్రసాద్ కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శులు ఇనపల్లి పవన్ సాయి ,గుండల సుజన్, మాణిక్యాల వినయ్, గుగులోత్ వంశీ జిల్లా ఉపాధ్యక్షులు అక్కినపల్లి నాగేంద్రబాబు, కొరిమి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.




