Kothagudem: మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు: అదనపు కలెక్టర్!

Kothagudem: జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట నిఘా ఉంచాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 27 Aug 2026 6:08 PM IST
Kothagudem
X

Kothagudem: మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు: అదనపు కలెక్టర్!

కొత్తగూడెం: జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అధికారులను గురువారం ఆదేశించారు. ఐడిఓసీ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నివారణ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో వ్యక్తుల జీవితాలుదుర్భరమవుతాయని, ముఖ్యంగా యువత వీటి బారిన పడకుండా ముందస్తు అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువత, కార్మికులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో గంజాయి సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, రవాణా వంటి చర్యలను తీవ్రంగా పరిగణించాలని అన్నారు. సంబంధిత శాఖలన్నీ ప్రణాళికబద్ధంగా సమన్వయంతో పనిచేస్తూ నిరంతర తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

గత సమావేశం నుండి ప్రస్తుత సమావేశం వరకు నమోదైన కేసులు, వాటి పురోగతి, మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్రంగా చర్చించారు.ఆర్టీసీ ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆర్టీసీ కండక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, అనుమానాస్పద వస్తువులపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు,ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

Next Story