Bhadrachalam: గిరిజనుల వినతులను గడువులోగా పరిష్కరించాలి

Bhadrachalam: భద్రాచలంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో గిరిజనుల వినతులు స్వీకరించి, నిర్దిష్ట గడువులోగా సమస్యలు పరిష్కరించాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Sept 2026 6:37 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: గిరిజనుల వినతులను గడువులోగా పరిష్కరించాలి

భద్రాచలం: వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చే గిరిజనులు గిరిజన దర్బార్లో సమర్పించే వినతులకు సత్వర పరిష్కారం చూపాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఐటీడీఏ యూనిట్ అధికారులను ఆదేశించారు.

ఈ రోజు ఐటిడిఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ ఆదివాసి ఏజెన్సీ గిరిజన గ్రామాల నుంచి వచ్చిన గిరిజనుల వినతులు, సమస్యల ఫిర్యాదులను ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎస్ డి సి ట్రైబల్ వెల్ఫేర్ ఆనందకుమార్, గురుకులం ఆర్ సి ఓ అరుణకుమారి, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఎడిఎంహెచ్వో సైదులు తో కలసి స్వీకరించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, పెన్షన్లు, గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రత తదితర సమస్యలను గిరిజనులు పి ఓ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ. ఆదివాసి గిరిజనుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు గిరిజన దర్బార్ కార్యక్రమం ప్రభుత్వం కల్పించిన ముఖ్యమైన వేదిక అని అన్నారు.

గిరిజనుల నుంచి స్వీకరించిన ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా సంబంధిత శాఖల యూనిట్ అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు.ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి ఎలాంటి అవకాశం ఉండకూడదని ఐటీడీఏ పీవో తెలిపారు.

ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖలకు వెంటనే పంపించాలని సూచించారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, క్లిష్టమైన సమస్యలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

శాఖల మధ్య సమన్వయంతో గిరిజన ప్రజల సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని పిఓ సూచించారు. గిరిజన దర్బార్ లో స్వీకరించిన ప్రతి వినతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, పరిష్కార స్థితిని పరిశీలించాలని యూనిట్ అధికారులను ఆదేశించారు. గిరిజనుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా స్పందించి, ప్రభుత్వ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందించాలని తెలిపారు.

ప్రజలు తమ దరఖాస్తులతో పాటు సమస్యకు సంబంధించిన అవసరమైన ఆధార పత్రాలను సమర్పిస్తే పరిష్కారం మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని పిఓ తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు ప్రతి యూనిట్ అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గిరిజన దర్బార్ లో వచ్చిన దరఖాస్తులు

పోడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, గిరిజన గ్రామాలలో రోడ్డు సౌకర్యం కల్పించుట కొరకు, స్వయం ఉపాధి ద్వారా జీవనాధారం పెంపొందించుకోవడానికి ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు, ఎల్ టి ఆర్ భూముల సమస్యలు పరిష్కరించుట కొరకు, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో చేరడానికి శిక్షణలు అందించుట కొరకు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు, పంట పొలాలకు నీరు అందించడానికి కరెంటు, బోరు, మోటారు ఇప్పించుట కొరకు, రైతుబంధు రుణాలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పించుట కొరకు గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story