Bhadrachalam: రోడ్లు బాగు చేయండి.. సంబురాలు కాదు - ఇరప రాజు దొర
Bhadrachalam: భద్రాచలం వాజేడు రహదారి గుంతలమయంగా మారిందని, సంబురాలు మాని రోడ్లు బాగు చేయాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ ఇరప రాజు దొర డిమాండ్ చేశారు.
Bhadrachalam: రోడ్లు బాగు చేయండి.. సంబురాలు కాదు - ఇరప రాజు దొర
భద్రాచలం: భద్రాచలం నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకుండా కేవలం సంబురాలు ఆర్భాట కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప రాజు దొర తెలిపారు.
వాజేడు నుంచి భద్రాచలం వరకు ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా భారీ ఇసుక లారీల నిరంతర రాకపోకలతో రహదారి మరింత దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వందలాది గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే రోగులు ప్రతిరోజూ ఈ రహదారిపైనే ఆధారపడుతున్నారని తెలిపారు.
రహదారి గుంతల కారణంగా వాహన ప్రమాదాల ప్రమాదం పెరుగుతోందని, అంబులెన్సులు సైతం వేగంగా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.ఇసుక రవాణా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ఇసుక లారీల కారణంగా దెబ్బతింటున్న రోడ్ల మరమ్మతులపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
భద్రాచలం నియోజకవర్గంలోని రహదారుల దుస్థితిపై అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.ప్రజల ప్రాణాల కంటే సంబురాలు ముఖ్యం కాదు. ముందుగా రోడ్లు బాగు చేయండి.. ప్రజల ప్రాణాలను కాపాడండి” అని ఇరప. రాజు దొర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిద్రపోతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కొని తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజలతో కలిసి రహదారి సమస్యపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.




