Kothagudem: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలి AIYF!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు పెంచాలని AIYF జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా డిమాండ్ చేశారు. సమస్యలు తీర్చకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Sept 2026 11:10 AM IST
Kothagudem
X

Kothagudem: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలి AIYF!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని AIYF జిల్లా కార్యదర్శి ఎస్‌కే ఫహీమ్ దాదా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. AIYF ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించే కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (JGH)ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఫహీమ్ దాదా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు పేద, మధ్యతరగతి ప్రజలు పెద్ద సంఖ్యలో వైద్యం కోసం వస్తున్నారని, అయితే అనేక ఆసుపత్రుల్లో సరైన మౌలిక వసతులు, వైద్య సిబ్బంది, మందులు, అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, పారామెడికల్, ఇతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైన మందులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు అత్యవసర చికిత్సలకు అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చాలని కోరారు.

బ్లడ్ బ్యాంకులు, ల్యాబ్ సేవలు, 24 గంటల అత్యవసర వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, రోగులకు అవసరమైన పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా నిర్వహించేలా సదుపాయాలను పెంచాలని సూచించారు.

అలాగే ఆసుపత్రుల్లో తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్, రోగులు–సహాయకులకు వసతి వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

గిరిజన ప్రాంతాలు అధికంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మండల స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసి.. దూర ప్రాంతాల ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలపై జిల్లా స్థాయిలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఫహీమ్ దాదా కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఆసుపత్రుల సమస్యల పరిష్కారం కోసం AIYF ఆధ్వర్యంలో దశలవారీగా ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌కే ఖయ్యుమ్, రవికిరణ్, జావీద్, రసూల్, కొయ్యడ రవి, చిన్ను, ఇమ్రాన్, శివ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story