Singareni: విజిలెన్స్ అత్యుత్సాహం తగ్గించుకోవాలి: ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి
Singareni: మారుపేర్లు (బదిలీ), విజిలెన్స్ కేసుల కార్మికుల డిపెండెంట్లకు తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ డిమాండ్ చేశారు.
Singareni: విజిలెన్స్ అత్యుత్సాహం తగ్గించుకోవాలి: ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి
సింగరేణి: సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ కేసుల కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ ఆరోపించారు.
సమస్య పరిష్కారం కోసం డిపెండెంట్లు చేపడుతున్న నిరసన దీక్షకు ఏఐటీయూసీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.మంగళవారం సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద మారుపేర్లు, విజిలెన్స్ కేసుల కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న నిరసన దీక్ష శిబిరాన్ని వంగ వెంకట్ సందర్శించారు. దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు.ఎనిమిదేళ్లుగా పెండింగ్
మారుపేర్లు, విజిలెన్స్ కేసులకు సంబంధించిన కార్మికుల డిపెండెంట్ల ఉద్యోగాల సమస్య గత ఎనిమిదేళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. గత టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ సమస్యపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగిందని, వన్‌టైం సెటిల్‌మెంట్ కింద డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించే దిశగా నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం మారడంతో సమస్య మళ్లీ పెండింగ్‌లో పడిపోయిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కోల్‌బెల్ట్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వంగ వెంకట్ తెలిపారు. ఆ హామీతో కోల్‌బెల్ట్ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులకు కార్మికులు, ప్రజలు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు కాలలు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం చూపకపోవడం బాధాకరమన్నారు.
ఉద్యోగాలు కల్పించే అంశంపై అడ్వకేట్ జనరల్‌కు లేఖ రాసినట్లు సింగరేణి యాజమాన్యం చెబుతోందని వంగ వెంకట్ తెలిపారు. ఏజీ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని యాజమాన్యం యూనియన్‌తో జరిగిన సమావేశంలో స్పష్టం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయశాఖ మంత్రి లేదా అడ్వకేట్ జనరల్ నుంచి తగిన ఆదేశాలు వచ్చేలా చర్యలు చేపడితే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు.
గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ యాజమాన్యంతో నిర్వహించిన తొలి స్ట్రక్చర్ సమావేశంలోనే ఈ సమస్యను ప్రస్తావించినట్లు తెలిపారు. అదేవిధంగా సమ్మె నోటీసులోనూ డిపెండెంట్ల ఉద్యోగాల అంశాన్ని ప్రధాన డిమాండ్‌గా చేర్చామని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఉద్యోగాల కల్పనలో జాప్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు.కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఈ సమస్యపై ప్రభుత్వంపై తగిన స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం లేదని విమర్శించారు.
ఇప్పటికైనా కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వచ్చి ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డిపెండెంట్ల న్యాయమైన పోరాటానికి ఏఐటీయూసీ అండగా ఉంటుందని, సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి మద్దతుగా నిలుస్తామని వంగ వెంకట్ స్పష్టం చేశారు అనంతరం ఎఐటియుసి నాయకులు నిమ్మరసం అందచేసి దీక్షవిరమణచేయించారు.
కార్యక్రమంలో కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి,బ్రాంచ్ కార్యదర్శులు రమణమూర్తి, గట్టయ్య,ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్,సహాయ కార్యదర్శి రాము, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్,భరణి,పిట్ కార్యదర్శులు మధు కృష్ణ ,కమల్,నరేష్, బండారి మల్లయ్య,మండల రాజేశ్వరరావు ,నాగయ్యా,గావిని నాగరాజు,మారుపేర్లు–విజిలెన్స్ కేసుల కార్మికుల డిపెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.




