Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరువు పరిస్థితులపై ఏఐకేఎంఎస్ ఆందోళన. బోర్ల కింద సాగు చేస్తున్న రైతులకు 16 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 14 Sept 2026 4:48 PM IST
Kothagudem
X

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మామిడాల బిక్షపతి డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో బోర్ల కింద సాగు చేసుకుంటున్న రైతులకు రోజుకు కనీసం 16 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.

కొత్తగూడెంలోని ఐఎఫ్‌టీయూ రైటర్ బస్తీ కార్యాలయంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కల్తి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బిక్షపతి మాట్లాడారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రంగంపై ఆధారపడిన వ్యాపార, పారిశ్రామిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సుమారు 600 మంది ప్రతినిధులు మహాసభల్లో చర్చించనున్నారని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 28న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 3,000 మందిని తరలించేందుకు రైతు కూలీ సంఘం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బిక్షపతి పిలుపునిచ్చారు.

ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు చంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. అరకొరగా కురుస్తున్న వర్షాలతో మెట్ట పంటలకు తగినంత నీరు అందడం లేదని, దీంతో పంట దిగుబడులు గణనీయంగా తగ్గే పరిస్థితి ఏర్పడిందన్నారు. వరి నాట్లు 10 శాతం కూడా పూర్తికాలేదని, నారుమళ్లు పశువులకు మేతగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బోరుబావులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చంద్రారెడ్డి పేర్కొన్నారు. బోర్ల కింద సాగు చేస్తున్న రైతులకు రోజుకు 16 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. కరువు సహాయక చర్యల కోసం ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాలని కోరారు.

కరువు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా సెప్టెంబర్ 18న మండల కార్యాలయాల ఎదుట, సెప్టెంబర్ 19న కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు కూలీలతో ధర్నాలు నిర్వహించి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చంద్రారెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో ఎస్కే ఉమర్, భూక్య హర్జ్య, పూనెం రంగయ్య, బచ్చలి సారయ్య, కొమరం సత్యనారాయణ, మూడు మాలు, కుంజ కృష్ణ, పూనెం కోటయ్య, పెద్దగోని ఆదిలక్ష్మి, ఇంటికి లక్ష్మి, గుగులోత్ రామచంద్రు, నెల్లూరి నాగేశ్వరరావు, ముసలి సతీష్, వల్లోజి రమేష్, బత్తుల గోపి, మట్ట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM