Yellareddypeta: జర్నలిస్టులకు గుండె, కిడ్నీ వ్యాధులపై అవగాహన సదస్సు

Yellareddypeta: ఎల్లారెడ్డిపేట అశ్విని ఆసుపత్రిలో జర్నలిస్టులకు గుండె, కిడ్నీ వ్యాధులు, ఆధునిక చికిత్సా విధానాలు మరియు జీవనశైలి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

KALEEM, SIRICILLA
Published on: 8 Sept 2026 10:48 PM IST
Yellareddypeta
X

Yellareddypeta: జర్నలిస్టులకు గుండె, కిడ్నీ వ్యాధులపై అవగాహన సదస్సు

ఎల్లారెడ్డిపేట: గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులపై ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆసుపత్రి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ జి. సత్యనారాయణ స్వామి, డాక్టర్ జి. అభినయ్‌తో పాటు గుండె వైద్య నిపుణులు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ నాగార్జున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గుండె సంబంధిత వ్యాధులకు అందించే ఆధునిక చికిత్సా విధానాలను వివరించారు. యాంజియోగ్రామ్, అత్యవసర పరిస్థితుల్లో స్టెంట్ అమర్చే విధానం, అత్యాధునిక వైద్య పరికరాలతో అందించే చికిత్సపై అవగాహన కల్పించారు. గుండె వ్యాధులను తొలిదశలోనే గుర్తించి సకాలంలో చికిత్స పొందితే తీవ్ర ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని తెలిపారు.

కేతలబ్ ద్వారా గత మూడు నెలల్లో 30 మందికి స్టెంట్లు, 80 మందికి యాంజియోగ్రామ్‌లు నిర్వహించినట్లు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. గుండె సంబంధిత యాంజియోగ్రామ్, స్టెంట్ ప్రక్రియలను 12 మంది సభ్యులతో కూడిన వైద్య బృందంతో నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ జి. సత్యనారాయణ స్వామి, డాక్టర్ జి. అభినయ్ పేర్కొన్నారు.

అనంతరం జర్నలిస్టులు ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించారు. కిడ్నీ వ్యాధులు ఎలా వస్తాయి, వాటిని ముందుగానే గుర్తించడం, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ నాగార్జున అవగాహన కల్పించారు. ప్రతిరోజూ తగినంత నీరు తీసుకోవాలని, ఉప్పును మితంగా వినియోగించాలని సూచించారు. జీవనశైలిలో జాగ్రత్తలు పాటించడం ద్వారా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చని తెలిపారు.

మారుమూల మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడం అభినందనీయమని మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. వివిధ విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ వైద్యులతో అశ్విని ఆసుపత్రి ద్వారా స్థానికంగానే వైద్య సేవలు అందుబాటులోకి రావడం పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story