Karimnagar: రాజీవ్ రహదారిపై వాగేశ్వరి విద్యార్థుల రాస్తారోకో!
Karimnagar: జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా రాజీవ్ రహదారిపై వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాల డిప్లొమా విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు.
Karimnagar: రాజీవ్ రహదారిపై వాగేశ్వరి విద్యార్థుల రాస్తారోకో!
కరీంనగర్: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాల డిప్లొమా విద్యార్థులు ఈ రోజు రాజీవ్ రహదారిపై భైఠాయించి రాస్తారోకో చేశారు. విద్యార్థి సంఘ నాయకులతో కలిసి ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విద్యార్థుల తోపులాటలో పోలీసులు, విలేకరులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థులకు నచ్చజెప్పినా వినకపోవడం, సంఘ నాయకులు అతిగా ప్రవర్తించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాస్తారోకో సమయంలో అంబులెన్స్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం, వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో అవస్థలు పడ్డారు. డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న జీవో 97ని రద్దు చేసి గత విధానాన్ని కొనసాగించాలని విద్యార్థులు కోరారు.
డిప్లొమా పూర్తయిన విద్యార్థులు మళ్లీ ఇంటర్మీడియట్ చదువాలని ప్రభుత్వం జీవో తీసుకురావాడన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యార్థులు తెలిపారు. డిప్లొమా విద్యార్థులను ఐటిఐకి సమానం చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం డిప్లొమా చదువుతున్న విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఈ విధానాన్ని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు.
లాటరీ ఎంట్రీ పద్దతి ద్వారా డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీటెక్ రెండో సంవత్సరంలోకి వెళ్లేలా గతంలో ఉన్న అకాశాలన్ని తిరిగి కల్పించాలని ప్రభుత్వాన్ని విద్యార్థులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము ఆంధోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా విద్యార్థి సంఘాల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులను రోడ్డుపైకి పంపించి రాస్తారోకో చేసేలా చూసిన కళాశాల యాజమాన్యంపై విమర్శలు వెళ్లువెత్తాయి. రోడ్డుపై విద్యార్థులకు ఏదైనా జరిగినా, రాస్తారోకో చేసినందుకు, విధులకు ఆటంకం కల్గించినందుకు విద్యార్థులపై కేసులు నమోదైనా ఎవరు బాధ్యులని, కళాశాల బాధ్యత వహిస్తుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఎల్ఎండీ ఎస్సై అన్వర్ తోపాటు పోలీసులు అనుమతి లేకుండా రోడ్డుపై రాస్తారోకో చేసిన విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు.




