Sircilla: ఎస్సై పేరుతో రూ.15 లక్షలు నొక్కిన కేటుగాళ్లను పట్టుకున్న పోలీసులు!

Sircilla: పోలీసుల పేరుతో గూగుల్, టెలిగ్రామ్‌లలో మీ-సేవ కేంద్రాలను మోసగిస్తున్న ఇద్దరు అంతర్ జిల్లా సైబర్ నేరగాళ్లను సిరిసిల్ల చందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 13 Aug 2026 4:33 PM IST
Sircilla
X

Sircilla: ఎస్సై పేరుతో రూ.15 లక్షలు నొక్కిన కేటుగాళ్లను పట్టుకున్న పోలీసులు!

Sircilla: పోలీసుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు అంతర్ జిల్లా సైబర్ నిందితులను చందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గూగుల్, టెలిగ్రామ్ ద్వారా మీ-సేవ కేంద్రాలు, మనీ ట్రాన్స్‌ఫర్ సెంటర్ల ఫోన్ నంబర్లను సేకరించి, పోలీస్ అధికారులుగా పరిచయం చేసుకుని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నల్గొండ జిల్లా మోతే మండలానికి చెందిన, ప్రస్తుతం హైదరాబాద్ మీర్‌పేట్ అల్మాస్‌గూడలో నివాసం ఉంటున్న కిలుకాని సాయిచంద్ (30), సూర్యాపేటకు చెందిన, ప్రస్తుతం మీర్‌పేట్‌లో నివాసం ఉంటున్న కట్కూరి శరత్ కుమార్ (31) ఈ మోసాలకు పాల్పడినట్లు వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

నిందితులు తమను ASI శ్రీనివాస్ రెడ్డిగా పరిచయం చేసుకుని, పోలీస్ అధికారికి అత్యవసరంగా ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బులు అవసరమయ్యాయని నమ్మించేవారు. అనంతరం ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించాలని కోరేవారు. ముందుగానే పెట్రోల్ బంక్ సిబ్బందిని సంప్రదించి, వాహనం లేదా బోర్ బండి రిపేర్ కోసం తమ సర్ డబ్బులు పంపిస్తారని చెప్పి వారి ఫోన్ నంబర్లు తీసుకునేవారు.

ఆ నంబర్లను బాధితులకు ఇచ్చి ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేయించుకుని, అనంతరం పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి నగదు తీసుకునేవారని పోలీసులు తెలిపారు.చందుర్తి మండలానికి చెందిన చిలుక పెంటయ్యకు కూడా ఇదే విధంగా ఫోన్ చేసి, తమను చందుర్తి పోలీస్ స్టేషన్‌కు చెందిన ASI శ్రీనివాస్ రెడ్డిగా పరిచయం చేసుకున్నారు.

తన కుమారుడు అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అత్యవసరంగా రూ.70 వేల అవసరమని నమ్మించారు. నిందితులు ఇచ్చిన పెట్రోల్ బంక్ నంబర్‌కు పెంటయ్య రూ.70 వేల ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు. అనంతరం నిందితులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు చందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చందుర్తి సీఐ రవీందర్, ఎస్‌ఐ రమేష్, సైబర్ క్రైమ్ ఆర్‌ఎస్‌ఐ జునైద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసింది.

నిందితుల నుంచి నేరం ద్వారా సమకూరిన సొమ్ములో భాగంగా రూ.18 వేల నగదు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 28కు పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు బాధితుల నుంచి సుమారు రూ.15 లక్షల వరకు మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు.

నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసిన సీఐ రవీందర్, ఎస్‌ఐ రమేష్, ఆర్‌ఎస్‌ఐ జునైద్, సిబ్బంది అనిల్, గంగారెడ్డిని డీఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు.పోలీసుల పేరుతో ఫోన్ చేసి అత్యవసరంగా డబ్బులు పంపించాలని కోరితే అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story