Sircilla: చేయూత పెన్షన్ల పరిశీలన పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్ గరిమ

Sircilla: సిరిసిల్ల జిల్లాలో చేయూత సామాజిక భద్రత పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను సెప్టెంబర్ 25 వరకు పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 15 Sept 2026 6:37 PM IST
Sircilla
X

Sircilla: చేయూత పెన్షన్ల పరిశీలన పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్ గరిమ

సిరిసిల్ల: చేయూత సామాజిక భద్రత పెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలనపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దరఖాస్తుదారుల నివాస స్థితి, సామాజిక–ఆర్థిక పరిస్థితులు, పెన్షన్ కేటగిరీ, అర్హత ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించాలని ఆదేశించారు. అర్హులైన దరఖాస్తులను గుర్తించడంతో పాటు.. అనర్హతకు గల నిర్దిష్ట కారణాలను చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు.

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, నేత కార్మికులు, పైలేరియా, డయాలసిస్ బాధితులకు సంబంధించిన దరఖాస్తుల్లో అవసరమైన ధ్రువపత్రాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.

వితంతువులకు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ల వయసు నిబంధనను పరిశీలించాలని తెలిపారు. గీత కార్మికులకు 50 ఏళ్ల వయసుతో పాటు ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ పత్రం, సొసైటీ సభ్యత్వాన్ని పరిశీలించాలని.. నేత కార్మికులకు 50 ఏళ్ల వయసుతో పాటు హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ శాఖ గుర్తింపు పత్రం ఉండాలని స్పష్టం చేశారు.

పైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ పత్రం, డయాలసిస్ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న వివరాలను పరిశీలించాలని ఆదేశించారు. దివ్యాంగులకు సదరం శిబిరం ద్వారా మంజూరైన 40 శాతం వైకల్య ధ్రువీకరణతో కూడిన యూడీఐడీ పత్రం, చెవిటి వారికి 51 శాతం వైకల్య ధ్రువీకరణతో కూడిన యూడీఐడీ పత్రం ఉండాలని తెలిపారు.

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేయూత పెన్షన్ ప్రయోజనం అందేలా పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సంతోష్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA