Yellareddypet: అక్కపల్లిలో ఉద్రిక్తత.. భూ వివాదం నేపథ్యంలో మృతదేహంతో నిరసన!
Yellareddypet: ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో భూ వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది.
Yellareddypet: అక్కపల్లిలో ఉద్రిక్తత.. భూ వివాదం నేపథ్యంలో మృతదేహంతో నిరసన!
Yellareddypet: ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో కుటుంబ భూ వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. తాటిచెట్టుపై నుంచి పడి చికిత్స పొందుతూ దేవయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. మృతదేహంతో ఆందోళన చేపట్టడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అక్కపల్లి గ్రామానికి చెందిన దేవయ్య నెల రోజుల క్రితం తాటిచెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే దేవయ్య మరణంతో కుటుంబంలో కొనసాగుతున్న భూ వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది.
తన వాటా భూమిని తమ్ముడు ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తూ దేవయ్య కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తమ్ముడు ఇంటి ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తూ అంబులెన్స్‌తో రోడ్డుపై బైఠాయించారు. దేవయ్య కుమార్తెలు, కుటుంబ సభ్యులు భూ వివాదంపై వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి దించేందుకు కుటుంబ సభ్యులు యత్నించగా ఉద్రిక్తత మరింత పెరిగింది.
దాదాపు నాలుగు గంటలపాటు రోడ్డుపై నిరసన కొనసాగింది. అనంతరం ఉన్నతాధికారులతో మాట్లాడిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటికి తరలించారు.
అయితే భూ వివాదంపై పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. మరోవైపు నిరసన చేస్తున్న మహిళలను పోలీసులు తోసివేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
దేవయ్య మృతితో కుటుంబ భూ వివాదం మళ్లీ తెరపైకి రావడం అక్కపల్లి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.




