Sultanabad: మైనర్ బాలికల ఆచూకీ కేవలం 12 గంటల్లోనే ఛేదించిన పోలీసులు!

Sultanabad: సుల్తానాబాద్ బాలసదన్ నుండి గోడ దూకి వెళ్ళిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను డీసీపీ రామ్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు 12 గంటల్లో నల్గొండలో రక్షించారు.

KONDAL, SULTANABAD
Published on: 30 July 2026 7:40 PM IST
Sultanabad
X

Sultanabad: మైనర్ బాలికల ఆచూకీ కేవలం 12 గంటల్లోనే ఛేదించిన పోలీసులు!

సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో గల బాలసదన్ చిల్డ్రన్ హోమ్ నుండి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను పోలీసులు కేవలం 12 గంటల వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించి రక్షించారు.

​పోలీసుల కథనం ప్రకారం... జూలై 29 తెల్లవారుజామున ఇద్దరు మైనర్ బాలికలు బాలసదన్ కాంపౌండ్ గోడ దూకి బయటకు వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి (IPS) ఆదేశాల మేరకు పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. గాలింపు చర్యల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పెద్దపల్లి, కరీంనగర్, స్థానిక ప్రాంతాలతో పాటు బాలికల బంధువులున్న పాలితం ప్రాంతానికి పంపించారు.

​సాంకేతిక ఆధారాలతో ప్రయాణ మార్గం ఛేదన:

దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా బాలికల ప్రయాణ మార్గాన్ని పోలీసులు విశ్లేషించారు. బాలికలు సుల్తానాబాద్ చౌరస్తా నుండి ఆటోలో పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు, అక్కడి నుండి రైలులో భువనగిరికి, అనంతరం బస్సులో నల్గొండకు వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసు బృందాలు నల్గొండ బస్టాండులో ఉన్న బాలికలను సురక్షితంగా అదుపులోకి తీసుకుని, చట్టపరమైన విధానంలో సంబంధిత అధికారులకు అప్పగించారు.

​పోలీసులకు అభినందనల వర్షం:

కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించి బాలికలను కాపాడిన సుల్తానాబాద్ సీఐ పొన్నమనేని రంజిత్ రావు, ఎస్‌హెచ్‌ఓ చంద్రకుమార్, టెక్నికల్ టీమ్ మరియు పోలీసు సిబ్బందిని డీసీపీ రామ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వాడడం వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. వేగంగా స్పందించి బాలికలను కాపాడిన పోలీసు శాఖను స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, చైల్డ్ వెల్ఫేర్ ప్రతినిధులు అభినందించారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story