Sultanabad: సుల్తానాబాద్‌లో రూ. 219 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన

Sultanabad: సుల్తానాబాద్ మండలం గరేపల్లిలో రూ. 219.67 కోట్ల హెచ్‌ఏఎం, నాన్‌ప్లాన్ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

KONDAL, SULTANABAD
Published on: 19 Aug 2026 5:59 PM IST
Sultanabad
X

Sultanabad: సుల్తానాబాద్‌లో రూ. 219 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన

సుల్తానాబాద్‌: రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, రహదారుల అభివృద్ధితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

సుల్తానాబాద్‌ మండలం గరేపల్లిలో బుధవారం రూ.219 కోట్ల 67 లక్షల విలువైన హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హెచ్‌ఏఎం), నాన్‌ప్లాన్‌ రహదారి అభివృద్ధి పనులకు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ తో కలిసి శంకుస్థాపన చేసారు.

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి ప్రజలు మంచి నాయకుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, ఎమ్మెల్యే విజయరమణారావు ఎల్లప్పుడూ పెద్దపల్లి అభివృద్ధి గురించే ఆలోచిస్తూ పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే పెద్దపల్లి బైపాస్‌ రహదారికి నిధులు మంజూరు చేశామని, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రూ.13 వేల కోట్లతో, పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో రూ.17 వేల కోట్లతో రహదారి పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత భారీ మొత్తంలో రహదారి పనులు చేపట్టడం లేదన్నారు. హెచ్‌ఏఎం విధానంలో ప్రభుత్వం 40 శాతం, కాంట్రాక్టర్‌ 60 శాతం నిధులు భరించే విధంగా పనులు చేపడుతున్నామని, నేడు శంకుస్థాపన చేసిన రహదారి పనులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలిపారు. పనులు వారం రోజుల్లోనే క్షేత్రస్థాయిలో ప్రారంభమవుతాయని చెప్పారు.

రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ప్రమాదాల నివారణకు వాహనదారులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. రహదారులు సంక్షేమ పథకాలతో సమానంగా అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులను వదిలి వెళ్లిందని మంత్రి అన్నారు. హైదరాబాద్‌ నుంచి రామగుండం వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణంపై కేంద్ర మంత్రితో చర్చలు జరిపామని, ప్రతిపాదిత రహదారిలో సుల్తానాబాద్‌ బైపాస్‌ను కూడా మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టును చేపడుతోందని అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి సాగునీరు అందించడంతో రికార్డు స్థాయిలో సాగు నమోదైందని తెలిపారు. నెహ్రూ హయాంలో నిర్మించిన అనేక ప్రాజెక్టులు ఇప్పటికీ సురక్షితంగా ఉండి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయని పేర్కొన్నారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ విప్‌ విజయరమణారావు విక్రమార్కుడిలా ప్రజలు, రైతుల కోసం నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో సమస్యలను పారదర్శకంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన మంత్రి పదవిని త్యాగం చేసి ఉద్యమానికి మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు.

గత పది సంవత్సరాల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం కఠిన పరిస్థితుల్లోనూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తుమ్మల అన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్‌ కార్డుల మంజూరు వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా పాఠశాలలు నిర్మిస్తున్నామని, ఆరోగ్యం, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇటీవల టీమ్స్‌ ఆసుపత్రులను ప్రారంభించడంతో పాటు విఫలమైన సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో గోదావరి, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా సాధించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్‌ సాగును విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయిల్‌పామ్‌ పరిశ్రమ ప్రారంభానికి మరో 6 వేల ఎకరాల సాగు అవసరమని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్‌, స్ప్రింక్లర్‌, రుణమాఫీ వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించిందని, అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచడంతో పాటు రైతుల నుంచి పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. మొక్కజొన్నను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో పెద్దపల్లి జిల్లాలో కేవలం రూ.900 కోట్ల విలువైన రహదారి పనులు మాత్రమే మంజూరయ్యాయని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.1,700 కోట్ల విలువైన రహదారి పనులు మంజూరయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు.

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు కృషితో పెద్దపల్లి బైపాస్‌ రహదారికి నిధులు మంజూరై పనులు జరుగుతున్నాయని తెలిపారు. కొత్త పోలీస్‌ స్టేషన్‌, అవసరమైన ప్రభుత్వ భవనాలు, తహసీల్దార్‌ కార్యాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. రూ.1,700 కోట్ల రహదారి పనులతో రైతులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను వేగంగా రవాణా చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

పెద్దపల్లి జిల్లాలో రైస్‌మిల్లులు అధికంగా ఉన్నందున గోదాముల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఎలాంటి కోతలు లేకుండా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.

రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి సంవత్సరంలో 3,500 ఇళ్లు మంజూరు చేయగా, ప్రస్తుతం మరో 2 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో మహిళలకు అందించిన పావలా వడ్డీ రుణాల పథకాన్ని విస్మరించారని, ప్రస్తుత ప్రభుత్వం వడ్డీలేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌–రామగుండం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రతిపాదనలో సుల్తానాబాద్‌ బైపాస్‌ను చేర్చేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పారు.

ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రుల సహకారంతో సుమారు రూ.180 కోట్ల విలువైన హెచ్‌ఏఎం రహదారి పనులకు నేడు శంకుస్థాపన చేశామని అన్నారు.

జూలపల్లి మండల కేంద్రంలో రూ.15 కోట్లతో నాలుగు లేన్ల రహదారి, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు, కాల్వ శ్రీరాంపూర్‌ మండల కేంద్రంలో రూ.7.35 కోట్లతో నాలుగు లేన్ల రహదారి, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు, గంగారం, ఉషన్నపల్లి, పాండిల్ల గ్రామాల్లో రూ.17 కోట్లతో సింగిల్‌ లేన్‌ రహదారులను డబుల్‌ లేన్‌గా విస్తరించే పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే పెద్దపల్లి బైపాస్‌ రహదారికి మంజూరు వచ్చినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.82 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. భూసేకరణకు అవసరమైన మరో రూ.27 కోట్లను ముఖ్యమంత్రి సహకారంతో త్వరలో విడుదల చేయిస్తామని, ఏడాదిలోపు పెద్దపల్లి బైపాస్‌ రహదారిని పూర్తి చేసి ఆర్‌అండ్‌బీ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

సుల్తానాబాద్‌ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున బైపాస్‌ రహదారి అత్యవసరమని ప్రభుత్వ విప్‌ తెలిపారు. రాజీవ్‌ రహదారి పరిధిలో సుల్తానాబాద్‌ బైపాస్‌ నిర్మాణానికి అవకాశం ఉందని, భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. సుల్తానాబాద్‌ బైపాస్‌ నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.

పెద్దపల్లి నియోజకవర్గానికి కేంద్ర గ్రాంట్లు, నాన్‌ప్లాన్‌ నిధుల కింద అనేక రహదారులు మంజూరయ్యాయని విజయరమణారావు తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా 40 వేల మెట్రిక్‌ టన్నుల గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, 11 పీఏసీఎస్‌ల సమన్వయంతో నాబార్డ్‌ రుణం ద్వారా మరో 15 వేల మెట్రిక్‌ టన్నుల గోదాముల నిర్మాణానికి అనుమతులు మంజూరై పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఒక్క పంట కాలంలోనే పెద్దపల్లి నియోజకవర్గం నుంచి 2.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం, 40 వేల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామని తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు చేసి పది రోజుల్లోనే రైతులకు చెల్లింపులు చేశామని అన్నారు. మరో 60 వేల మెట్రిక్‌ టన్నుల గోదాముల సామర్థ్యం, 5 వేల మెట్రిక్‌ టన్నుల కోల్డ్‌ స్టోరేజ్‌ మంజూరు చేయాలని, సుల్తానాబాద్‌లో కొత్త ఐబీ అతిథి గృహం నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేయాలని కోరారు.

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గానికి మరిన్ని హెచ్‌ఏఎం రహదారులు మంజూరు చేయాలని ఆర్‌అండ్‌బీ మంత్రిని కోరారు. హైదరాబాద్‌–రామగుండం రహదారి నిర్వహణ సక్రమంగా లేదని, ఈ రహదారిని విస్తరించడంతో పాటు అవసరమైతే కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్య గౌడ్‌, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాధాకృష్ణ, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, గోదావరిఖని డిప్యూటీ మేయర్‌ పారుపల్లి ఎల్లయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story