Sircilla: ఆగస్టు 15న సీఎం చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Sircilla: ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి 6 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Sircilla: ఆగస్టు 15న సీఎం చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
సిరిసిల్ల: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఈ నెల ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి 6 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వాతావరణ పరిస్థితులు, వన మహోత్సవం, వ్యవసాయం, నీటి నిర్వహణ, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, పంట మార్పిడి విధానాలు రైతులకు నష్టాలను తగ్గిస్తాయని, రైతులను పంటల వైవిధ్యీకరణ వైపు ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే భూగర్భ జలాల పెంపు కోసం పంట కుంటల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, రైతులకు నీటి లభ్యతపై అవగాహన కల్పించేందుకు ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశాలు నిర్వహించాలని, వన మహోత్సవం లక్ష్యాలను పూర్తి చేసి నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.




