Siricilla: సిరిసిల్లలో రైస్ మిల్లర్ల ఆందోళన – కలెక్టరేట్ ఎదుట ధర్నా
Siricilla: సిరిసిల్లలో రైస్ మిల్లర్ల ఆందోళన, కలెక్టరేట్ ఎదుట ధర్నా. CMR అగ్రిమెంట్ సవరణ, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్.
Siricilla: సిరిసిల్లలో రైస్ మిల్లర్ల ఆందోళన – కలెక్టరేట్ ఎదుట ధర్నా
సిరిసిల్ల: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు శుక్రవారం సిరిసిల్లలో ఆందోళన చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణలక్ష్మి గార్డెన్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన మిల్లర్లు.. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు.
ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పబ్బ నాగరాజు మాట్లాడుతూ.. సీఎంఆర్ అగ్రిమెంట్‌ను ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆకస్మిక దాడులను నిలిపివేసి, మిల్లర్లతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
2014 నుంచి పెండింగ్‌లో ఉన్న సివిల్ సప్లై మిల్లింగ్, రవాణా, డ్రయల్, కస్టోడియల్ చార్జీలను వెంటనే చెల్లించాలని కోరారు. 2022-23 రబీ టెండర్ ధాన్యం ధరను న్యాయబద్ధంగా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. రైస్ మిల్లులను వ్యవసాయ అనుబంధ సంస్థలుగా గుర్తించి 200 హెచ్‌పీ వరకు విద్యుత్‌ను ఎల్‌టీ కేటగిరీలో సరఫరా చేయాలని కోరారు.
నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని సరఫరా చేయాలని, నాణ్యతలో వ్యత్యాసం ఉన్న సందర్భంలో ధాన్యం నాణ్యతకు అనుగుణంగా బియ్యం రేషియోను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పెనాల్టీ విధించిన మిల్లులకు బకాయిలను నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం కల్పించాలని, ఎఫ్‌సీఐ కఠిన నిబంధనలను కొంతమేర సడలించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో చేపూరి నాగరాజు, గరిపెల్లి ప్రభాకర్, రాజిరెడ్డి, శ్రీనివాస్, అనిల్‌రావు, వంశీధర్‌రావు, సత్యంరావు తదితరులు పాల్గొన్నారు.




