Siricilla: ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి కలెక్టర్
Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
Siricilla: ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి కలెక్టర్
సిరిసిల్ల: ఎల్ నినో ప్రభావంతో ఎదురయ్యే పరిస్థితులపై ప్రజలు, రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలు, తెలంగాణ జలసిరి పనులు, వైద్య ఆరోగ్య అంశాలపై రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోస్టర్లు, కరపత్రాలు జిల్లాలోని ప్రతి గ్రామానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ, ఆరోగ్య శాఖ సిబ్బంది కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేసి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంతో పంటలపై ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆయిల్‌పామ్, పండ్ల తోటలు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు.
తెలంగాణ జలసిరి కింద ఇంకుడు గుంతల నిర్మాణం, ప్రభుత్వ, ప్రైవేట్ బోర్‌వెల్స్ రీచార్జ్ పనులను ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూగర్భ జలాల లభ్యత, భవిష్యత్ అవసరాలపై వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు రైతులకు సంయుక్తంగా అవగాహన కల్పించాలని సూచించారు. పంట కుంటలు, ఊట కుంటలు పూర్తి చేయడంతో పాటు వర్షపు నీటిని సంరక్షించే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. వర్షపు నీటి సంరక్షణతో భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్‌లో ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
డెంగ్యూ, మలేరియా వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా సూచనలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌డీఎస్ మెంబర్ సెక్రటరీ శ్రీనివాస్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ తదితరులు పాల్గొన్నారు.




