Siricilla: భూముల రీసర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి కలెక్టర్
Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. నక్ష సర్వేపై సమీక్ష.
Siricilla: భూముల రీసర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి కలెక్టర్
సిరిసిల్ల: జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన రికార్డులను వెంటనే సమర్పించాలని సూచించారు. భూముల రీసర్వే, నక్ష సర్వే ప్రక్రియపై కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో ఇప్పటివరకు గంభీరావుపేట మండలం శ్రీనివాసపురం, కోనరావుపేట మండలం లచ్చపేట, వేములవాడ మండలం చంద్రగిరి, చందుర్తి మండలం అనంతపల్లి గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తయినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మిగతా గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేయాలని సూచించారు. భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా సేకరించాలని, ప్రతిరోజూ లక్ష్యాలను నిర్దేశించుకుని పారదర్శకంగా రీసర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే వేములవాడలో నక్ష సర్వేను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కె.ఎస్.బి. కుమారి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.




