Sircilla: యూరియా కొరతపై బీజేపీ ఆందోళన.. నేతల ముందస్తు అరెస్ట్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరతపై బీజేపీ ఆందోళన. 'చలో యూరియా గోదాం' పిలుపుతో ముందస్తుగా పలువురు నేతల అరెస్ట్, గోదాం వద్ద భారీ బందోబస్తు.
Sircilla: యూరియా కొరతపై బీజేపీ ఆందోళన.. నేతల ముందస్తు అరెస్ట్!
Sircilla: యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్ ద్వారా యూరియా పొందే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పాటు, గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సరఫరాను సులభతరం చేసి, రైతులకు సకాలంలో బస్తాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ‘రైతు గోస.. బీజేపీ భరోసా’ పేరుతో యూరియా కొరతపై బీజేపీ ఆందోళనకు సిద్ధమైంది. తెలంగాణలో యూరియా కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా అందడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా యూరియా బస్తాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ఆన్‌లైన్‌లో 800 బస్తాలు అందుబాటులో ఉన్నట్లు కనిపించినా కేవలం మూడు సెకన్లలోనే స్టాక్ జీరోగా మారుతోందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. యూరియా బస్తాలు ఎక్కడికి వెళ్తున్నాయి? దళారుల చేతుల్లోకి చేరుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రైతులతో కలిసి ‘చలో యూరియా గోదాం’ కార్యక్రమానికి బీజేపీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయనతో పాటు పలువురు బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా సిరిసిల్లలోని అప్పారెల్ పార్క్ యూరియా గోదాం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
యూరియా కొరతపై రైతుల ఇబ్బందులు, బీజేపీ ఆందోళన, నాయకుల ముందస్తు అరెస్టులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయ వేడి నెలకొంది.




