Sircilla: క్షుద్ర పూజల పేరుతో మోసం, ఇద్దరి అరెస్ట్

Sircilla: సిరిసిల్లలో క్షుద్ర పూజలు, మంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 31 Aug 2026 8:26 PM IST
Sircilla
X

Sircilla: క్షుద్ర పూజల పేరుతో మోసం, ఇద్దరి అరెస్ట్

సిరిసిల్ల: క్షుద్ర పూజలు, మంత్రాలు, చేతబడులు, గుప్తనిధుల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.30 లక్షల 50 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, క్షుద్ర పూజలకు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన తురుపాటి శ్యాం కుమార్ హైదరాబాద్ తూముకుంటలో భద్రకాళి పూజా సామాగ్రి దుకాణం నిర్వహిస్తున్నాడు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామానికి చెందిన పత్తెం లక్ష్మీరాజంతో అతడికి పరిచయం ఉంది. లక్ష్మీరాజం క్షుద్ర పూజలు చేస్తానని చెప్పడంతో ఇద్దరూ కలిసి అమాయకులను మోసం చేయాలని పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ శ్యాం కుమార్ వద్దకు పూజా సామాగ్రి కోసం వెళ్లింది. ఆమెకు క్షుద్ర పూజల ద్వారా దీర్ఘకాలిక అనారోగ్యం పూర్తిగా నయం చేస్తామని శ్యాం కుమార్ నమ్మించినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం ఆమెను సిరిసిల్ల పాత బస్టాండ్ వద్దకు తీసుకువచ్చి లక్ష్మీరాజానికి పరిచయం చేశాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం లక్ష్మీరాజం కూడా ఆమెకు అనారోగ్యం నయం చేస్తానని నమ్మించి పూజల కోసం డబ్బులు కావాలని చెప్పాడు.

మొదట రూ.10 లక్షలు నగదుగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం యాదగిరిగుట్ట వద్ద రూ.21 లక్షలు, కాశీలో రూ.13 లక్షలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా బ్యాంకు ఖాతాల్లో విడతల వారీగా సుమారు రూ.62 లక్షల వరకు డబ్బులు పంపించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

పూజల పేరుతో ఆమెను వివిధ ప్రాంతాలకు తిప్పుతూ మరింత డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్తులో తమను ప్రశ్నించకుండా ఉండేందుకు తెల్లకాగితాలపై ఆమెతో సంతకాలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.

తన అనారోగ్యం నయం కాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితురాలు నిందితులను ప్రశ్నించగా.. క్షుద్ర పూజలు, చేతబడి చేసి ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె పొలంలో గుప్తనిధులు ఉన్నాయని, వాటిని వెలికితీసి ఇస్తామని చెప్పి మరోసారి నమ్మించినట్లు పేర్కొన్నారు.

ఈ నెల 23న డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి సిరిసిల్ల పాత బస్టాండ్‌కు రావాలని బాధితురాలిని పిలిచిన నిందితులు అక్కడికి రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదుతో సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం అగ్రహారం గ్రామంలోని లక్ష్మీరాజం ఇంటి వద్ద ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ.30,50,000 నగదు, రెండు సెల్‌ఫోన్లు, క్షుద్ర పూజలకు ఉపయోగించే బెల్లంతో తయారు చేసిన రెండు బొమ్మలు, పసుపు, కుంకుమ తదితర పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ గణేష్‌తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి

అనారోగ్య సమస్యలకు క్షుద్ర పూజలు, చేతబడులు, మంత్రాలు పరిష్కారం కాదని ప్రజలు గుర్తించాలని ఎస్పీ సూచించారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు అర్హత కలిగిన వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందాలని తెలిపారు.

పూజలు, మంత్రాలు, గుప్తనిధులు లేదా ఇతర మూఢనమ్మకాల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసి మోసం చేయడానికి ప్రయత్నిస్తే నమ్మకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story