Sircilla: రోడ్డుపై నాట్లు వేసి తండాల మహిళల వినూత్న నిరసన

Sircilla: సిరిసిల్ల జిల్లా వీర్నాపల్లి మండలం వన్ పల్లి తండాలలో రోడ్ల దుస్థితిపై మహిళల నిరసన. బురదమయమైన గుంతల్లో వరి నాట్లు వేసి ఆవేదన.

KALEEM, SIRICILLA
Published on: 14 Sept 2026 6:34 PM IST
Sircilla
X

Sircilla: రోడ్డుపై నాట్లు వేసి తండాల మహిళల వినూత్న నిరసన

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నాపల్లి మండలం వన్ పల్లి పరిధిలో రోడ్ల దుస్థితిపై తండాల మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. కేలోత్ తండా, శంకర్ నాయక్ తండా, రెడ్డి నాయక్ తండాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారడంతో.. రోడ్డుపై గుంతల్లో నీరు నిలిచి బురదమయంగా మారిన పరిస్థితుల్లో మహిళలు రోడ్డుపైనే నాట్లు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

మూడు తండాల్లో సుమారు 120 కుటుంబాలకు చెందిన 346 మంది నివసిస్తున్నారని, ఏళ్లుగా సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలిపారు. తమ తండాలకు రోడ్లు మంజూరు చేశామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతూ ఐదేళ్లు గడిచినా పనులు మాత్రం ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లు బురదమయమై రాకపోకలు నిలిచిపోతున్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అంబులెన్స్‌లు సైతం తండాలకు చేరుకోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్యను వివరించినా హామీలకే పరిమితమయ్యారని మహిళలు ఆరోపించారు. ఇప్పటికైనా తమ తండాలకు రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

రోడ్డు సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కేలోత్ తండా, శంకర్ నాయక్ తండా, రెడ్డి నాయక్ తండాల ప్రజలు హెచ్చరించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA