Sircilla: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు - డీఎంహెచ్‌ఓ
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పీసీపీఎన్‌డీటీ కమిటీ సమావేశం. లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్ మాత్రల విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక.
Sircilla: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు - డీఎంహెచ్‌ఓ
సిరిసిల్ల: జిల్లాలో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టేందుకు పీసీపీఎన్‌డీటీ జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలు, నిబంధనలు, లింగ నిర్ధారణ పరీక్షల వల్ల కలిగే సామాజిక దుష్పరిణామాలపై చర్చించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఏ స్కానింగ్ సెంటర్‌లోనైనా గర్భస్థ శిశువు లింగాన్ని నిర్ధారించే పరీక్షలు నిర్వహించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని కోర్టులో కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. అన్ని స్కానింగ్ సెంటర్లు చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
అదేవిధంగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో అబార్షన్ మాత్రలు విక్రయిస్తున్న అంశంపైనా సమావేశంలో చర్చించారు. అక్రమ విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ అంశంపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు లేఖ రాయడంతో పాటు అవసరమైన చోట డీకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది.
గ్రూప్ సమావేశాలు, బాలికల కళాశాలలు, స్వయం సహాయక సంఘాల సమావేశాల ద్వారా ఐఈసీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గోడ రాతలు, వాల్ పెయింటింగ్స్ ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
మరోవైపు జిల్లాలో మాతృ మరణాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా డీఎంహెచ్‌ఓ సమీక్ష నిర్వహించారు. గర్భిణులకు ఎత్తు, బరువు, బీపీ, హెచ్‌బీ, రక్తహీనతతో పాటు హైపర్‌టెన్షన్, ప్లేట్లెట్ల వంటి అవసరమైన పరీక్షలు నిర్వహించాలని ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఎంసీహెచ్ సూపర్‌వైజర్లకు సూచించారు. సాధారణ ప్రసవాలు జరిగేలా గర్భిణులకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు.
ఏ ఒక్క మాతృమరణం జరగకుండా అన్ని విధాలా కృషి చేయాలని, అనివార్య కారణాలతో ఎక్కడైనా మాతృమరణం సంభవిస్తే పూర్తి వివరాలను నిర్దేశిత ఫార్మాట్‌లో నమోదు చేయాలని సూచించారు.
సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగేందర్ బాబు, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సుగుణ, పీడియాట్రిషియన్ డాక్టర్ పరమేష్, డీపీఆర్వో పి.బి. శ్రీనివాస చారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజనీకాంత్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భాస్కర్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.




