Sircilla: రాజీ మార్గమే రాజమార్గం: ఎస్పీ మహేష్ బి. గితే!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈనెల 12న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను రాజీ పడదగిన కేసుల పరిష్కారం కోసం సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మహేష్ బి. గితే కోరారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Sept 2026 10:58 AM IST
Sircilla
X

Sircilla: రాజీ మార్గమే రాజమార్గం: ఎస్పీ మహేష్ బి. గితే!

Sircilla: ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుని సమయం, డబ్బును ఆదా చేసుకోవాలని ఆయన కోరారు.

క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబపరమైన వివాదాలు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు తదితర రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఎస్పీ తెలిపారు.

చిన్నచిన్న కేసులతో కక్షలు పెంచుకుని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. న్యాయశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజీ మార్గమే రాజమార్గమని పేర్కొంటూ, పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

రాజీ పడదగిన కేసులను గుర్తించి, సంబంధిత ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు సిబ్బంది కూడా కక్షిదారులకు లోక్ అదాలత్ ప్రయోజనాలపై అవగాహన కల్పించి రాజీకి ప్రోత్సహించాలని ఆదేశించారు.

లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story