Sircilla: ఘనంగా నూలుపౌర్ణమి వేడుకలు - పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

Sircilla: సిరిసిల్లలో జరిగిన నూలుపౌర్ణమి వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 28 Aug 2026 10:01 PM IST
Sircilla
X

Sircilla: ఘనంగా నూలుపౌర్ణమి వేడుకలు - పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

సిరిసిల్ల: నూలుపౌర్ణమి సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. భక్త మార్కండేయ స్వామిని స్మరించుకుంటూ పద్మశాలీ సంఘాల ఆధ్వర్యంలో నూలుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నూలుపౌర్ణమి పద్మశాలీల ఆత్మీయ, ఆధ్యాత్మిక పండుగ అని అన్నారు. చేనేత కార్మికులు, పద్మశాలీ సమాజానికి ఈ పండుగ ఎంతో విశిష్టమైనదని పేర్కొన్నారు. భక్త మార్కండేయ స్వామి ఆశీస్సులతో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నూలుపౌర్ణమి వేడుకలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు.

నూలుపౌర్ణమి రోజున జంధ్యం వేసుకునే సంప్రదాయం ఉందని మంత్రి పేర్కొన్నారు. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను వినియోగించేలా, ప్రభుత్వ కార్యక్రమాల్లో చేనేత వస్త్రాలకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సిరిసిల్ల చేనేత సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

నూలు పవిత్రత, ఐక్యత, శుభానికి ప్రతీకగా భావిస్తారని, నూలుపౌర్ణమి సందర్భంగా మహిళలు, చేనేత కుటుంబాల సభ్యులు పవిత్ర నూలుతో తయారు చేసిన కంకణాలను ధరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. చేనేతకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన సిరిసిల్లలో నూలుపౌర్ణమి వేడుకలకు మరింత ప్రత్యేకత ఉందన్నారు.

పురాణకాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలను కాపాడుతూ పద్మశాలీ సంఘాలు, చేనేత కార్మికులు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. మంత్రోచ్ఛారణల మధ్య నూతన యజ్ఞోపవీతం ధరించే ఉపాకర్మ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

ఆధ్యాత్మికత, సంప్రదాయం, చేనేత సంస్కృతి కలగలిసిన నూలుపౌర్ణమి పండుగ పద్మశాలీ సమాజానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోందని మంత్రి అన్నారు. చేనేత వారసత్వాన్ని, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఈ సందర్భంగా సిరిసిల్లలోని పద్మశాలీ సోదర, సోదరీమణులకు, చేనేత కార్మిక కుటుంబాలకు మంత్రి నూలుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. భక్త మార్కండేయ స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story