Sircilla: సిరిసిల్లలో నేత కార్మికుడు వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

Sircilla: సిరిసిల్లలో మృతిచెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా, సమగ్ర దర్యాప్తుకు డిమాండ్.

KALEEM, SIRICILLA
Published on: 12 Aug 2026 6:48 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో నేత కార్మికుడు వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

సిరిసిల్ల: బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వెంకటేశం భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చిన కేటీఆర్.. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

వెంకటేశం మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి.. అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని వెలుగులోకి తీసుకురావాలని కేటీఆర్ పోలీసులను డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హత్య రాజకీయాలకు పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. రాజకీయంగా తమను ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలని, విమర్శలు చేయవచ్చని అన్నారు. అయితే సామాన్య ప్రజలను రాజకీయాలకు బలిపశువులుగా మార్చడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.

వెంకటేశం కేసులో కొంతమంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ.. వారు కేవలం పాత్రధారులేనని, అసలు సూత్రధారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారని, వారిలో ఇద్దరిని మాత్రమే రిమాండ్‌కు పంపి, మిగతా ముగ్గురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

వెంకటేశం కుటుంబం ఇబ్బందికర పరిస్థితుల్లో నివసిస్తోందని కేటీఆర్ తెలిపారు. కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే బీఆర్‌ఎస్ పార్టీ తరఫునే ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

వెంకటేశం కుమార్తె భవిష్యత్ బాధ్యతను తానే తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. బాలిక పేరుపై రూ.3 లక్షలు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. పదో తరగతి వరకు చదువు ఖర్చులు, ఆ తర్వాత ఆమె ఎంచుకునే ఉన్నత విద్యకు కూడా తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు.

వెంకటేశం మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలపై కూడా సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కేటీఆర్ కోరారు. ఈ ఘటనను రాజకీయ కోణంలో కాకుండా ఒక కుటుంబానికి జరిగిన అన్యాయంగా పరిగణించి విచారణ చేపట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని.. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కుట్రదారులు, బాధ్యులను పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story