Sircilla: సెప్టెంబర్ 17లోపు ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి దేవరాజ్ డిమాండ్

Sircilla: సెప్టెంబర్ 17లోపు ఉద్యమకారుల హామీలు నెరవేర్చకపోతే 'ఉద్యమకారుల కోసం ఉద్యమం' చేపడతామని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా చైర్మన్ గజ్జెల దేవరాజ్ హెచ్చరిక.

KALEEM, SIRICILLA
Published on: 1 Sept 2026 12:04 PM IST
Sircilla
X

Sircilla: సెప్టెంబర్ 17లోపు ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి దేవరాజ్ డిమాండ్

Sircilla: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గుర్తించి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్మన్ గజ్జెల దేవరాజ్ డిమాండ్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మేకల రామచంద్రం అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు ఆయనను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా గజ్జెల దేవరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మేకల రామచంద్రం కీలక పాత్ర పోషించారని తెలిపారు. రిలే నిరాహార దీక్షలు, సకల జనుల సమ్మె, వంటావార్పు తదితర అనేక కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు నేడు అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో జీవించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇకనైనా ఉద్యమకారులను ఆదుకుని వారికి న్యాయం చేయాలని కోరారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పింఛన్, ఉద్యమకారులపై ఉన్న కేసుల ఎత్తివేత, మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు పింఛన్‌తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వంటి హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు.

సెప్టెంబర్ 17లోపు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారికి ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని గజ్జెల దేవరాజ్ డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులందరినీ ఏకం చేసి ‘ఉద్యమకారుల కోసం ఉద్యమం’ అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఫణి రాజారావు, వికాస్ సమితి జిల్లా అధ్యక్షులు, మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అక్కెనపెల్లి కరుణాకర్, కుసపెల్లి సరస్వతి, సింగారం దేవరాజు, కర్నె లక్ష్మీ, గూగులోతు రేనా, పత్తిపాక పద్మశంకర్, మామిడాల రమణ, నేరల శ్రీకాంత్ గౌడ్, డాక్టర్ ఓదెల శ్రీనివాస్, అఫ్రోజ్, సికిందర్, పవన్, సాయిశరత్, సాయి గౌడ్, చోటు బాబా తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story