Sircilla: సిరిసిల్లలో యూరియా కష్టాలు - సొసైటీకి రైతుల తాళం
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లిలో యూరియా బుకింగ్ కాక సొసైటీకి తాళం వేసిన రైతులు. యాప్ ఇబ్బందులను, యూరియా కొరతను పరిష్కరించాలని రైతుల డిమాండ్.
Sircilla: సిరిసిల్లలో యూరియా కష్టాలు - సొసైటీకి రైతుల తాళం
సిరిసిల్ల: యూరియా బుకింగ్ కాకపోవడంతో ఆగ్రహించిన రైతులు సొసైటీకి తాళం వేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
మధ్యాహ్నం 3 గంటలకు యూరియా బుకింగ్ ప్రారంభమవుతుందని సొసైటీ నిర్వాహకులు చెప్పడంతో రైతులు ముందుగానే ఫోన్లు పట్టుకుని బుకింగ్ కోసం ఎదురుచూశారు. అయితే సమయం వచ్చిన తర్వాత బుకింగ్ చేసేందుకు ప్రయత్నించినా యూరియా బుక్ కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సొసైటీని ముట్టడించి తాళం వేశారు.
పంటలకు సరిపడా యూరియా లభించడం లేదని, అసలైన రైతులకే యూరియా అందని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సౌకర్యం కల్పించాల్సిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తమకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోందని ఆరోపించారు.
యాప్‌లో ఒకసారి గరిష్ఠంగా రెండు బస్తాల యూరియా మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసే రైతులు పలుమార్లు బుకింగ్ చేసుకోవాల్సి వస్తోందని తెలిపారు. యూరియా కోసం పదేపదే సొసైటీలు, డీలర్ల వద్దకు వెళ్లాల్సి రావడంతో వ్యవసాయ పనులు కూడా వదులుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు రిటైల్ డీలర్ల వద్ద యూరియా అందుబాటులో లేకపోవడం, సహకార సంఘాల్లో తగినంత నిల్వలు లేకపోవడం కూడా సమస్యకు కారణమవుతోందని రైతులు పేర్కొన్నారు.
రెండు బస్తాల సీలింగ్ ప్రకారం సీజన్ మొత్తానికి తమకు కేటాయించే యూరియా కోటాను ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. యాప్ బుకింగ్‌లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.




