Sircilla: మరణానంతరం చూపునివ్వండి.. నేత్రదానానికి ముందుకు రండి!

Sircilla: నేత్రదానం ద్వారా చూపులేని ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని సిరిసిల్ల డీఎంహెచ్‌ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు.

KALEEM, SIRICILLA
Updated on: 25 Aug 2026 4:38 PM IST
Sircilla
X

Sircilla: మరణానంతరం చూపునివ్వండి.. నేత్రదానానికి ముందుకు రండి!

సిరిసిల్ల: నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. జాతీయ అంధత్వం, దృష్టిలోపాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించనున్న 41వ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి గాంధీ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మాట్లాడుతూ.. మనిషి జీవితం ముగిసిన తర్వాత కూడా నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చన్నారు. ఒక వ్యక్తి మరణానంతరం నేత్రదానం చేస్తే సాధారణంగా ఇద్దరు చూపు కోల్పోయిన వ్యక్తులకు చూపు పునరుద్ధరణకు అవకాశం లభిస్తుందని తెలిపారు.

వ్యక్తి మరణించిన తర్వాత సాధ్యమైనంత త్వరగా, సాధారణంగా 6 నుంచి 8 గంటల్లోపు నేత్ర కణజాలాన్ని సేకరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నేత్రదానం వల్ల మృతదేహం రూపంలో ఎలాంటి మార్పు ఉండదని, వైద్య నిపుణులు అవసరమైన నేత్ర కణజాలాన్ని గౌరవప్రదంగా సేకరిస్తారని స్పష్టం చేశారు. నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడంతో పాటు, నేత్రదానంపై విస్తృత అవగాహన కల్పించేందుకు పక్షోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ.. మరణానంతరం నేత్రదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. రక్తపోటు, క్షయవ్యాధి, ఉబ్బసం ఉన్నవారు, కళ్లద్దాలు ఉపయోగించేవారు, కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా అనేక సందర్భాల్లో నేత్రదానం చేయవచ్చని తెలిపారు. అయితే అర్హతను వైద్య నిపుణులు నిర్ధారిస్తారని పేర్కొన్నారు.

నేత్రదానం ప్రతి కుటుంబంలో ఒక ఆచారంగా మారాలని, ఇది కేవలం దానం మాత్రమే కాదని.. మరణానంతరం కూడా మానవత్వాన్ని కొనసాగించే గొప్ప సేవ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేజస్విని, జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ నయంజహా, నేత్ర వైద్య సహాయకులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story