Sircilla: ఆరోగ్య కార్యక్రమాల్లో సిరిసిల్లను అగ్రస్థానంలో నిలపాలి: డీఎంహెచ్‌ఓ

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాను ఆరోగ్య రంగంలో అగ్రస్థానంలో నిలపాలని, సాధారణ ప్రసవాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని డీఎంహెచ్‌ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 8 Sept 2026 5:09 PM IST
Sircilla
X

Sircilla: ఆరోగ్య కార్యక్రమాల్లో సిరిసిల్లను అగ్రస్థానంలో నిలపాలి: డీఎంహెచ్‌ఓ

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆశా నోడల్ పర్సన్స్‌తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. మాతృ, శిశు మరణాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గర్భిణీలను ప్రారంభ దశలోనే గుర్తించి, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించేలా ఆశా కార్యకర్తలు పర్యవేక్షించాలని సూచించారు.

ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరుగుతున్న గర్భస్రావాలపై ప్రత్యేక నిఘా ఉంచి, వాటికి గల కారణాలను విశ్లేషించి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించేలా అవగాహన కల్పించాలని, ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు.

అలాగే గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులకు సాధారణ ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు. అనవసరంగా సిజేరియన్ ప్రసవాల వైపు వెళ్లకుండా వైద్యుల సూచనల మేరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఆశా నోడల్ పర్సన్స్ తమ పరిధిలోని ఆశా కార్యకర్తల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా కార్యక్రమ అధికారులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ నయం జహ, సీహెచ్‌ఓ శాంత, నోడల్ పర్సన్స్, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story