Sircilla: ప్రైవేట్ ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు!
Sircilla: సిరిసిల్ల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో డీఎంహెచ్‌వో డాక్టర్ ఆంజెలా ఆల్ఫ్రెడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలపై ఆదేశాలు జారీ చేశారు.
Sircilla: ప్రైవేట్ ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు!
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆంజెలా ఆల్ఫ్రెడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆసుపత్రుల నిర్వహణ తీరును ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు తప్పనిసరిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు, రోగుల నుంచి వసూలు చేస్తున్న రుసుముల వివరాలను స్థానిక భాషలో అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు.
అలాగే ఆసుపత్రులకు వచ్చే వైద్యుల కన్సల్టేషన్ వివరాలను రోగులకు స్పష్టంగా తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే నోటీసులు జారీ చేసి, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు పీసీపీఎన్‌డీటీ చట్ట నిబంధనలకు లోబడి పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు. పుట్టబోయే శిశువు లింగాన్ని తెలుసుకునేందుకు ఎవరైనా వస్తే వారి వివరాలను అధికారులకు తెలియజేయాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తేలితే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, సెక్షన్ ఇన్‌చార్జ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.




