Sircilla: సిరిసిల్లను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుస్తాం ఎస్పీ మహేష్ బి. గితే!
Sircilla: రాష్ట్రస్థాయి మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు 2వ స్థానం. జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అభినందించిన ఎస్పీ మహేష్ బి. గితే.
Sircilla: సిరిసిల్లను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుస్తాం ఎస్పీ మహేష్ బి. గితే!
Sircilla: మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 22 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అవగాహన వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు చేపట్టారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటు యువత, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం నిర్వహించారు.
ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర EAGLE ఫోర్స్ రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అభినందించారు.
జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తుందని ఎస్పీ తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన ఒక్క పోలీస్ శాఖతోనే సాధ్యం కాదని, తల్లిదండ్రులు, విద్యార్థులు, యువత, ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలని కోరారు.
ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు.




