Sircilla: సిరిసిల్ల జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం!

Sircilla: సిరిసిల్ల జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్. చిన్నచిన్న వివాదాలను రాజీతో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ సూచన.

KALEEM, SIRICILLA
Published on: 12 Sept 2026 6:05 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం!

Sircilla: చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసుకొని శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా నష్టపోకుండా పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ సూచించారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ప్రారంభ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పి.నీరజ తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ చేయదగిన కేసులతో పాటు ప్రీ-లిటిగేషన్ కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో పరిష్కరించేందుకు లోక్ అదాలత్ మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు, మానసిక ప్రశాంతతను కోల్పోవడం కంటే పరస్పర చర్చల ద్వారా రాజీకి రావడం ఉత్తమమైన మార్గమని అన్నారు.

భార్యాభర్తలు చిన్నచిన్న విభేదాల కారణంగా విడిపోకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించాలని సూచించారు. అన్నదమ్ములు ఆస్తులు, భూముల విషయంలో తగాదాలకు వెళ్లకుండా కుటుంబ ఐక్యతను కాపాడుకోవాలని కోరారు. “కలిసి ఉంటే కలదు సుఖం” అనే మాటను గుర్తు చేస్తూ, అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి విభజన దావాలు, భూ వివాదాలు వంటి కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇటీవల నిర్వహించిన సమావేశంలో బార్ అసోసియేషన్ సభ్యులు అందించిన ప్రోత్సాహం, సహకారం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. లోక్ అదాలత్ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ, న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తున్న మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల్లో న్యాయ అవగాహన పెంపొందించడంలో మీడియా పాత్ర కీలకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పి.లక్ష్మణాచారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంతరావు, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA