Sircilla: కళ్యాణలక్ష్మి రద్దు చేయలేదన్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు
Sircilla: సిరిసిల్లలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రద్దుపై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు ధ్వజం.
Sircilla: కళ్యాణలక్ష్మి రద్దు చేయలేదన్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు
సిరిసిల్ల: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా రద్దు చేయలేదని, బీఆర్‌ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు అన్నారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నిర్వహించిన ధర్నాను ఆయన తీవ్రంగా ఖండించారు.
ప్రతి అంశాన్ని రాజకీయంగా మార్చడం బీఆర్‌ఎస్‌కు అలవాటుగా మారిందని సూర దేవరాజు విమర్శించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, వాటిని రద్దు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
ఈ పథకాలకు సంబంధించిన జీవోలపై హైకోర్టు ఈ నెల 12న మధ్యంతర స్టే విధించిందని తెలిపారు. సెప్టెంబర్ 9 వరకు వేచి చూడకుండా స్టేను తొలగించేందుకు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయిస్తున్నట్లు ప్రభుత్వం తరఫున పెద్దలు వెల్లడించారని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందని సూర దేవరాజు ఆరోపించారు. కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తోందన్నారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఆపుతామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని, పథకాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీఆర్‌ఎస్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సూర దేవరాజు కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ జగన్, కౌన్సిలర్లు లింగంపల్లి గంగరాజు, కూరపాటి శ్రీశైలం, మాజీ కౌన్సిలర్ నక్క నరసయ్య, కుడికల రవికుమార్, నాయకులు బొప్ప దేవయ్య, బైరి ప్రభాకర్, కంసాల మల్లేశం, ఇప్పపుల లక్ష్మణ్, ఆడెపు ప్రసాద్, పరశురాములు, సదుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.




