Sircilla: ప్రజావాణి ఫిర్యాదుపై అరగంటలో గురుకులంలో కలెక్టర్ తనిఖీ
Sircilla: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై అరగంటలోనే స్పందించి సిరిసిల్ల చిన్న బోనాల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Sircilla: ప్రజావాణి ఫిర్యాదుపై అరగంటలో గురుకులంలో కలెక్టర్ తనిఖీ
సిరిసిల్ల: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెంటనే స్పందించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో నీటి సరఫరా, ఇతర సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో... అరగంటలోనే కలెక్టర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా డైనింగ్ హాల్‌ను సందర్శించిన కలెక్టర్... విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా, ఆహారం నాణ్యత ఎలా ఉందో తెలుసుకున్నారు. బియ్యం, పప్పులు, కోడిగుడ్లు, నూనె తదితర ఆహార పదార్థాల నాణ్యతతో పాటు గడువు తేదీలను పరిశీలించారు. అనంతరం హాస్టల్ గదులు, టాయిలెట్లు తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యాలయంలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషాకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్... సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల ప్రిన్సిపాల్‌ను హెచ్చరించారు. ఇటీవల వేములవాడ ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను నిర్వహణలో లోపాల కారణంగా సస్పెండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడంతో పాటు విద్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్... విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రభుత్వ కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు. అలాగే వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.




