Sircilla: పోషణ మాసాన్ని పకడ్బందీగా నిర్వహించాలి - కలెక్టర్ గరిమ అగ్రవాల్

Sircilla: సిరిసిల్లలో జాతీయ పోషణ మాసం సమీక్షా సమావేశం. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు, పోషకాహారం అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం.

KALEEM, SIRICILLA
Published on: 16 Sept 2026 5:18 PM IST
Sircilla
X

Sircilla: పోషణ మాసాన్ని పకడ్బందీగా నిర్వహించాలి - కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోషణ మాసాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు నిర్వహించనున్న 9వ జాతీయ పోషణ మాసంపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోషణ మాసంపై రూపొందించిన పోస్టర్‌ను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.

ముందుగా జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం పోషణ మాసం షెడ్యూల్, కార్యాచరణ ప్రణాళికను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ‘మన అంగన్వాడీ.. మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అత్యాధునిక వసతులు, లైట్లు, ఫ్యాన్లు, ఆర్‌ఓ వాటర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువును ప్రతి నెలా తప్పనిసరిగా నమోదు చేసి అంగన్వాడీ యాప్‌లో వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. సామ్, మామ్, ఎస్‌యూడబ్ల్యూ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అంగన్వాడీ సూపర్‌వైజర్లు ఆయా పిల్లల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితిని పరిశీలించడంతోపాటు పోషకాహారం, సంరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

సామ్, మామ్, ఎస్‌యూడబ్ల్యూ పిల్లలకు బాలామృతం, బాలామృతం ప్లస్ ఆహార పదార్థాలను అందించాలని, ఎదుగుదల లోపం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలను డీఈఐసీ కేంద్రాలకు తరలించి అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పోషణ లోపం, తీవ్ర పోషణ లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి అదనపు పోషకాహారం అందించడంతోపాటు వైద్య శాఖ సిబ్బంది సమన్వయంతో వైద్య పరీక్షలు నిర్వహించి వారు సాధారణ స్థితికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని వేడి వేడిగా అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నెల 21న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.

ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల పరిధిలోని అన్ని వార్డుల్లో వార్డు ఆఫీసర్లు తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు. కేంద్రాల లోపల, బయట పరిశుభ్రతను పర్యవేక్షించి అవసరమైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, డీఏఓ అఫ్జల్ బేగం, డీసీఎస్ఓ డీఎం గోపాల్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA