Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8.65 లక్షల మొక్కలే లక్ష్యం కలెక్టర్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాలలో వన మహోత్సవం. మెగా ప్లాంటేషన్‌ ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్, ప్లాస్టిక్ నిషేధంపై పిలుపు.

KALEEM, SIRICILLA
Published on: 25 Aug 2026 2:18 PM IST
Sircilla
X

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8.65 లక్షల మొక్కలే లక్ష్యం కలెక్టర్!

Sircilla: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గంభీరావుపేట మండలం గోరంటాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మెగా ప్లాంటేషన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవులను సంరక్షిస్తేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని తెలిపారు. అడవులతోనే వర్షాలు కురుస్తాయని, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో వన్యప్రాణులు, పక్షుల మనుగడకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం, పర్యావరణ సమస్యలు తలెత్తడం వంటి పరిణామాలకు అడవుల తగ్గుదల కూడా కారణమన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 8,65,200 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 6,89,212 మొక్కలు నాటి 79.66 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు. వన మహోత్సవంలో భాగంగా రెండు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో ప్రతి ఇంటికి మూడు నుంచి ఐదు మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.

ముఖ్యంగా మునగ మొక్కలను పెంచడం వల్ల ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. మార్కెట్‌, షాపులకు వెళ్లేటప్పుడు బట్ట సంచులను ఉపయోగించాలని, ఇళ్లలో, శుభకార్యాల్లో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వినియోగించాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఇంటికి అందించిన తడి, పొడి చెత్త బుట్టలను సద్వినియోగం చేసుకోవాలని, ఇంటి నుంచే చెత్తను వేరు చేసి అందించాలని సూచించారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కొమురిశెట్టి విజయ, సర్పంచ్ లతిక, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story