Sircilla: సిరిసిల్లలో జూనియర్ కళాశాల ఫోర్జరీ అమ్మకంపై రగడ!
Sircilla: సిరిసిల్లలో శ్రీకృష్ణదేవరాయ జూనియర్ కళాశాల ఫోర్జరీ విక్రయంపై వివాదం. తమ సంతకాలు ఫోర్జరీ చేశారని దిడ్డి శ్రీనివాస్ ఆరోపణ, టౌన్ స్టేషన్‌లో కేసు నమోదు.
Sircilla: సిరిసిల్లలో జూనియర్ కళాశాల ఫోర్జరీ అమ్మకంపై రగడ!
Sircilla: శ్రీకృష్ణదేవరాయ జూనియర్ కళాశాలను తమకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో ఇతరులకు విక్రయించారని కళాశాల నిర్వాహకుడు దిడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాను మరికొందరితో కలిసి రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతనగర్‌లో నిర్వహిస్తున్న పద్మశ్రీ జూనియర్ కళాశాలను 2004లో కొనుగోలు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. అనంతరం కళాశాల పేరును శ్రీకృష్ణదేవరాయ జూనియర్ కళాశాలగా మార్చి నిర్వహిస్తున్నామని చెప్పారు.
కళాశాలకు సంబంధించిన లెక్కలు చూపించాలని 2024 ఏప్రిల్ 18 నుంచి సొసైటీ ప్రధాన కార్యదర్శిని కోరుతున్నప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ క్రమంలో కళాశాలను తమకు తెలియకుండా విక్రయించిన విషయం తెలిసిందన్నారు.
2023 డిసెంబర్ 1న తమకు సమాచారం లేకుండా జనరల్ బాడీ సమావేశం నిర్వహించినట్లు పత్రాల్లో చూపించారని, సొసైటీ సభ్యుల వివరాలు ఉన్న పేజీని మార్చి తనతో పాటు తన భార్య దిడ్డి రమ సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు రూపొందించారని ఆరోపించారు. ఆ పత్రాల ఆధారంగా కళాశాలను ఇతరులకు బదలాయించారని తెలిపారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే సిరిసిల్ల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాస్ వెల్లడించారు. ఫిర్యాదుపై పోలీసులు క్రైమ్ నంబర్ 298/2026గా కేసు నమోదు చేసి, బీఎన్‌ఎస్ సెక్షన్లు 318(4), 336(3), 340(2), 3(5) కింద దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
కళాశాల, ప్లాట్‌కు సంబంధించిన పత్రాలు, సంతకాల నిజానిజాలు, లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.




