Jagtial: ప్రైవేటు స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!
Jagtial: జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రైవేటు పాఠశాల బస్సును ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టింది.
Jagtial: ప్రైవేటు స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!
Jagtial: జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. స్థానిక అటవీశాఖ (ఫారెస్ట్) కార్యాలయం సమీపంలో విద్యార్థులతో వెళ్తున్న ఒక ప్రైవేటు పాఠశాల బస్సును ఆర్టీసీ అద్దె బస్సు బలంగా ఢీకొట్టింది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తుండగా, అటవీశాఖ కార్యాలయం సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సు అనూహ్యంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాల బస్సులో పలువురు విద్యార్థులు ఉన్నారు.
ఈ ప్రమాదంలో బస్సు భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, డ్రైవర్ అప్రమత్తత వల్ల ఎవరికీ ఎటువంటి తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల నిబంధనలు, డ్రైవర్ల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.




