Peddapalli: బ్రెయిన్‌డెత్ బాధితుల అవయవ దానానికి కుటుంబాలు ముందుకు రావాలి
Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగుండం సిమ్స్ (SIMS) వైద్య కళాశాలలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించారు.
Peddapalli:బ్రెయిన్‌డెత్ బాధితుల అవయవ దానానికి కుటుంబాలు ముందుకు రావాలి
పెద్దపల్లి: జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం సిమ్స్ వైద్య కళాశాలలో అవయవ దానంపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
నాటో, జీవన్‌దాన్ ఉన్నతాధికారుల సూచనల మేరకు సిమ్స్ మెడికల్ కాలేజీ నిర్వహించిన పెయింటింగ్, నినాద రచన, వ్యాస రచన, పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దయాళ్ సింగ్, గోదావరిఖని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హిమబిందు సింగ్ అభినందన పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అవయవదానం మహాదానమని, బ్రెయిన్‌డెత్ సంభవించిన సందర్భాల్లో కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం అవయవ, దేహదానాలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్న సదాశయ ఫౌండేషన్ సేవలను డాక్టర్ హిమబిందు సింగ్ ప్రశంసించారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్ లింగమూర్తి, కార్యదర్శి భీష్మాచారిని ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ... మరణానంతరం మట్టిలో కలిసిపోయే అవయవాలను దానం చేయడం ద్వారా పలువురి ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలో 250 మందికిపైగా నేత్రదానం చేయడం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని కోరారు. తన భర్త ప్రభంజన్ యాదవ్ నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్‌కు, దేహాన్ని జనగామ వైద్య కళాశాలకు దానం చేసిన సిమ్స్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రేఖను సదాశయ ఫౌండేషన్ ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ కన్నాల ఇన్‌చార్జి చింతకింది కనకయ్య, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.




