Sircilla: సిరిసిల్ల చైర్‌పర్సన్‌పై ఏఐ సాంకేతికతతో దుష్ప్రచారం!
Sircilla: జిందం కళా చక్రపాణి తనపై సోషల్ మీడియాలో ఏఐ ఫోటోలు, వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్న మిట్టపల్లి శ్రీకాంత్‌పై జిల్లా ఎస్పీ మహేష్ గీతేకు ఫిర్యాదు చేశారు.
Sircilla: సిరిసిల్ల చైర్‌పర్సన్‌పై ఏఐ సాంకేతికతతో దుష్ప్రచారం!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి జిల్లా ఎస్పీ మహేష్ గీతేకు ఫిర్యాదు చేశారు. మిట్టపల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఏఐ సాంకేతికతతో రూపొందించిన ఫోటోలు, వీడియోలు ఉపయోగించి తనపై, మున్సిపల్ పాలకవర్గంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి పనులపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేస్తూ తన వ్యక్తిగత గౌరవం, సామాజిక ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ప్రజల్లో వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
అలాగే తన భర్త జిందం చక్రపాణిని మున్సిపల్ పరిపాలనతో అనుసంధానం చేస్తూ ఏఐ ద్వారా రూపొందించిన ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఇది మహిళా ప్రజాప్రతినిధిగా తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే చర్య అని పేర్కొన్నారు.
ఇలాంటి తప్పుడు ప్రచారాలు, సైబర్ బెదిరింపులపై మిట్టపల్లి శ్రీకాంత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు.
ఇదే అంశంపై బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి కూడా జిల్లా ఎస్పీకి ప్రత్యేక ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.




