Sircilla: రాజన్న సిరిసిల్లలో యూరియా కోసం రైతుల పడిగాపులు
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, గంభీరావుపేటలో యూరియా కోసం క్యూలైన్లలో రైతుల నిరీక్షణ. పంపిణీని క్రమబద్ధీకరించాలని అన్నదాతల డిమాండ్.
Sircilla: రాజన్న సిరిసిల్లలో యూరియా కోసం రైతుల పడిగాపులు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. తంగళ్లపల్లిలో యూరియా కోసం రైతులు ఉదయం నుంచే క్యూలైన్లలో నిలబడి గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. మరోవైపు గంభీరావుపేటలో యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు అధికారుల పంపిణీ తీరుపై అసంతృప్తికి కారణమవుతున్నాయి.
గంభీరావుపేట ఫ్యాక్స్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలబడగా.. కొందరు రైతులు తమ స్థానాన్ని కాపాడుకునేందుకు చెప్పులను క్యూలో పెట్టిన దృశ్యాలు కనిపించాయి. ఎరువుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తంగళ్లపల్లిలోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఉదయం నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే బస్తాల కోసం నిరీక్షిస్తున్నామని, మధ్యాహ్నం వరకు కూడా యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.
యాప్‌లో ముందుగానే యూరియా బుక్ చేసుకున్నప్పటికీ క్యూలైన్‌లో నిలబడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా పంపిణీ ప్రక్రియను సులభతరం చేయాలని, రైతులకు సమయానికి ఎరువులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో యూరియా కొరత లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని.. రైతులకు ఇబ్బందులు కలగకుండా పంపిణీని క్రమబద్ధీకరించాలని అన్నదాతలు కోరుతున్నారు.




