Raikal: అల్లిపూర్‌లో సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ

Raikal: రాయికల్ మండలం అల్లిపూర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి. ప్రభుత్వ విధానాలపై విమర్శలు.

ANAND, JAGITYAL
Published on: 18 Aug 2026 8:07 PM IST
Raikal
X

Raikal: అల్లిపూర్‌లో సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ

రాయికల్: రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, సాధారణ గీత కార్మిక కుటుంబంలో జన్మించిన సర్వాయి పాపన్న, భూస్వామ్య, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా బహుజన సమాజ స్థాపనే లక్ష్యంగా పోరాడిన యోధుడని కొనియాడారు. ఖిలాషాఫూర్ కేంద్రంగా కోటను నిర్మించి, గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ఆయన గెరిల్లా యుద్ధ నైపుణ్యం అపారమైనదని గుర్తుచేశారు. పాపన్న చూపిన పోరాట స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి పునాదిగా నిలిచిందని తెలిపారు.

ప్రభుత్వ విధానాలపై మండిపడుతూ, కేసీఆర్ గారి హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 51% ఉన్న బహుజనుల శాతం, రేవంత్ రెడ్డి గారి పాలనలోని సర్వేలో ఎలా తగ్గిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపుల వల్ల ప్రమాదకరమైన గీత వృత్తి తీవ్ర సంక్షోభంలో పడిందని, ప్రభుత్వానికి ఆదాయం తప్ప ప్రజల ఆరోగ్యం పట్టడం లేదని విమర్శించారు.

గీతా కార్మికులకు ప్రమాద బీమా సహాయం ఏడాది గడిచినా అందడం లేదని, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, బీడీ కార్మికుల పింఛన్ల వంటి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలను ఎత్తివేసి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలోకి మార్చే నిర్ణయాన్ని పునరాలోచించాలని, చెట్ల పెంపకానికి భూమి కొనుగోలు పథకం ద్వారా భూములను కేటాయించాలని డిమాండ్ చేశారు.

రాజకీయాలకు అతీతంగా బలహీన వర్గాల కులవృత్తులను ప్రోత్సహించాలని, సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకుని సామాజిక, రాజకీయ మార్పులకై అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story