Hanumakonda: ముత్తారంలో రూ.3.74 కోట్లతో రోడ్డు పనులకు మంత్రి పొన్నం శంకుస్థాపన!
Hanumakonda: ముత్తారం గట్ల నర్సింగాపూర్ రోడ్డుకు రూ.3.74 కోట్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి.
Hanumakonda: ముత్తారంలో రూ.3.74 కోట్లతో రోడ్డు పనులకు మంత్రి పొన్నం శంకుస్థాపన!
Hanumakonda: హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ముత్తారం చౌరస్తా నుంచి గట్ల నర్సింగాపూర్ మీదుగా లంబాడీ తండా వరకు రూ.3.74 కోట్ల వ్యయంతో రహదారి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామానికి చేరుకున్న మంత్రి ముందుగా రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
అనంతరం గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముత్తారం గ్రామంలో 8 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలో రెండో దశలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగనుంది.
153 పెన్షన్లకు రూ.41.57 లక్షలు విడుదల చేస్తున్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 271 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.45.43 లక్షల ప్రయోజనం కల్పించారు.mమహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ ద్వారా 191 కుటుంబాలకు రూ.1.60 లక్షలు విడుదల చేశారు. 28 స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.1.60 లక్షలు అందించారు.
12 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.1.17 కోట్లు విడుదల చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మూడు మహిళా సంఘాలకు 300 స్టీల్ బ్యాంక్ కిట్లు, ఒక్కో కిట్‌లో 13 రకాల వస్తువులు అందించారు. హోటళ్లకు సైతం స్టీల్ గ్లాసులు అందించారు. 158 మంది రైతులకు రూ.1.35 కోట్ల రైతు రుణమాఫీ ప్రయోజనం కల్పించారు.
430 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.2.18 కోట్లు అందించారు. రైతు బీమా కింద మృతిచెందిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందించారు. నలుగురు రైతులకు సన్న వడ్ల బోనస్ కింద రూ.79,600 అందించారు. 13 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించారు. 63 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
గ్రామంలోని 422 రేషన్ కార్డులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. గ్రామ అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.15 లక్షల పనులు పూర్తి చేశారు. అంగన్వాడీకి తాగునీటి సౌకర్యం కోసం రూ.1 లక్షతో అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామ ప్రజలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. భూభారతి కార్యక్రమంలో భీమదేవరపల్లి అనంతరం ముత్తారం గ్రామంలో భూసర్వే చేపట్టనున్నారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, జల సిరి పథకం కింద ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ఒక్కో ఇంకుడు గుంతకు ప్రభుత్వం రూ.6,500, పొలం కుంటకు రూ.1.30 లక్షలు అందిస్తుందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని, ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి గ్రామాల్లో స్టీల్ బ్యాంకులను వినియోగించాలని మంత్రి సూచించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 31వ తేదీ వరకు పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు, తలసేమియా, హెచ్‌ఐవీ బాధితులు తదితర అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో నీటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. 14–15 సంవత్సరాల వయసున్న బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణకు అందించే టీకాను వేయించాలని మంత్రి సూచించారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని, ముత్తారం ప్రభుత్వ పాఠశాలకు పెయింటింగ్ వేయిస్తామని హామీ ఇచ్చారు.
యువత క్రీడల్లో రాణించాలి. యువత మొబైల్ ఫోన్లకు బానిసలు కాకుండా క్రీడా మైదానాలకు వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే మంచి గుర్తింపు రావడంతో పాటు, క్రీడా సర్టిఫికెట్ల ద్వారా ఇండియన్ ఆర్మీ, పోలీస్ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రీడలను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు కృష్ణను నియమించామని, నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో క్రీడా సామగ్రి అందించామని చెప్పారు. ముత్తారం గ్రామానికి క్రికెట్, వాలీబాల్ తదితర క్రీడా సామగ్రితో పాటు ఓపెన్ జిమ్ అందించినట్లు తెలిపారు. ఇటీవల హుస్నాబాద్ మినీ స్టేడియంలో కబడ్డీ అకాడమీ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించి వారు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలు తమ ఆర్థిక కార్యకలాపాలను పెంచుకునేలా రుణ పరిమితులను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచామని చెప్పారు.
ముత్తారం గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి స్థల సేకరణపై తీర్మానం చేసి ఇవ్వాలని, వెంటనే వీవో భవనం మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలి. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఇంటిపై సోలార్ పవర్ ఏర్పాటు చేసుకుంటే 3 కిలోవాట్ల వరకు రూ.78 వేల సబ్సిడీ లభిస్తుందని మంత్రి తెలిపారు. అవసరమైన విద్యుత్‌ను వినియోగించుకుని మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించుకునే అవకాశం ఉందన్నారు.
ఓటు హక్కును కాపాడుకోవాలి. ఎస్‌ఐఆర్ నో మ్యాపింగ్‌లో భాగంగా ముత్తారం గ్రామానికి చెందిన 22 మంది ఓటర్లకు నోటీసులు అందినట్లు మంత్రి తెలిపారు. సంబంధిత ఓటర్లు సరైన వివరాలను బీఎల్‌ఓలకు అందించి తమ ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ముత్తారం గ్రామానికి చారిత్రక గుర్తింపు. ముత్తారం గ్రామానికి కాకతీయుల కాలం నుంచే ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గ్రామంలోని త్రికూటేశ్వరాలయం చారిత్రక ప్రాధాన్యత కలిగినదని పేర్కొన్నారు. ముత్తారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి పనులను మంత్రి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని గ్రామ సర్పంచ్ ఊరడి భారతి జైపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో గురవయ్య, జిల్లా, మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్ ఊరడి భారతి జైపాల్ రెడ్డి, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




