Ramagiri: రాజాపూర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం!

Ramagiri: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది.

SHANKAR, MANTHANI
Published on: 5 Aug 2026 9:58 AM IST
Ramagiri
X

Ramagiri: రాజాపూర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం!

Ramagiri: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం ద్వారా బుధవారం రాత్రి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రామగిరి ఎస్సై శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బుద్దె స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఐ బుద్దె స్వామి మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్, మద్యం, సిగరెట్లు వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని యువతకు పిలుపునిచ్చారు. సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, లక్కీ డ్రా, ఓటీపీ పేరుతో మోసగాళ్లు చేసే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని హెచ్చరించారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదని సూచించారు.

గ్రామాల్లో దొంగతనాలు, ఇతర నేరాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మూఢనమ్మకాల పేరుతో జరిగే మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గంజాయి విక్రయించే లేదా వినియోగించే వారి సమాచారం పోలీసులకు అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాల నంబర్ ప్లేట్లలో ఎలాంటి మార్పులు చేయరాదని తెలిపారు. రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ-చలాన్ల ద్వారా జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుల్లెల్ల భాగ్యలక్ష్మి-కొమురయ్య, ఉపసర్పంచ్ కళావేనా శ్రీకాంత్, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, గ్రామస్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story