Peddapalli: పెద్దపల్లిలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
Peddapalli: పెద్దపల్లి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు.
Peddapalli: పెద్దపల్లిలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
పెద్దపల్లి: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా సంక్షేమం, జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం పెద్దపల్లి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన జిల్లా స్థాయి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి 2.50 లక్షల మందికి కొత్త సామాజిక భద్రతా పింఛన్లు, మరో 4 లక్షల మందికి గృహజ్యోతి ఉచిత విద్యుత్, 5 లక్షల మందికి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు.
పెద్దపల్లి జిల్లాకు రూ.వందల కోట్ల సంక్షేమం
- రేషన్ కార్డులు: కొత్తగా 30,909 రేషన్ కార్డులు – 88,357 మందికి లబ్ధి
- రైతు భరోసా: 1,53,582 మంది రైతులకు రూ.161.38 కోట్లు
- గృహజ్యోతి: 1,40,116 కుటుంబాలకు రూ.141.64 కోట్ల ఉచిత విద్యుత్ సబ్సిడీ
- ఇందిరమ్మ ఇండ్లు: 5,982 లబ్ధిదారులకు రూ.135 కోట్లు – మరో 5,250 ఇండ్లు మంజూరు
- మహాలక్ష్మి: 1.19 లక్షల మందికి రూ.500కే 4.74 లక్షల సిలిండర
పెద్దపల్లి ఆర్టీసీ బస్ డిపో నిర్మాణానికి రూ.8.40 కోట్లు మంజూరు కాగా పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రూ.82 కోట్లతో నాలుగు వరుసల పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కృషితో కోకాకోలా సంస్థ రూ.700 కోట్లకు పైగా పెట్టుబడితో రామగిరి మండలం రత్నాపూర్‌లో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని తెలిపారు. దీనితో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు.
జాతీయ సంగీత నాటక అవార్డు గ్రహీత దురిశెట్టి రామయ్యను, వరదల్లో సేవలందించిన అంతం శేఖర్, ఆకుల అరవింద్‌లను సన్మానించారు. 12 మంది పోలీసులకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ సేవా పతకాలు, 244 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, డీసీపీ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




