Peddapalli: కాంగ్రెస్ వైఫల్యాలపై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజం
Peddapalli: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనపై పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన. హామీలు నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్.
Peddapalli: కాంగ్రెస్ వైఫల్యాలపై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజం
పెద్దపల్లి: హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. మహిళలను చూడకుండా చిత్రహింసలకు గురి చేయడం సిగ్గుచేటని, ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనకు నిరసనగా, అమలు చేయని 420 హామీలు, ఆరు గ్యారంటీలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన తీరును ఖండిస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, విద్యార్థులకు రూ.5 లక్షల ఏటీఎం కార్డులు, 2 లక్షల ఉద్యోగాల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి మోసం చేశారని, ఐటీ మంత్రిగా ఉండి కూడా పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఒక్క పరిశ్రమ తీసుకురాలేకపోయారని విమర్శించారు.
పెద్దపల్లి పట్టణం మధ్యలో బస్ డిపో నిర్మాణం వల్ల ట్రాఫిక్, శబ్ద కాలుష్య సమస్యలు వస్తాయని, దాన్ని పట్టణం వెలుపల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బస్టాండ్ సమీప స్థలంలో ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాలు లేదా జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలన్నారు.
బీఆర్ఎస్ హయాంలో సంక్షేమ, అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జక్కు శ్రీహర్షిణి, రఘవీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.




