Peddapalli: పార్వతి బ్యారేజ్ కరకట్టకు తీవ్ర గండి.. 6 గ్రామాలకు ముప్పు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా సిరిపురం వద్ద కాళేశ్వరం పార్వతి బ్యారేజ్ కరకట్ట కుంగిపోయింది. వరద ముప్పుతో 6 గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
Peddapalli: పార్వతి బ్యారేజ్ కరకట్టకు తీవ్ర గండి.. 6 గ్రామాలకు ముప్పు!
జిల్లా: పెద్దపల్లి
పార్వతి బ్యారేజ్ కరకట్ట ప్రమాదకర స్థితి.. రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తుల విజ్ఞప్తి
Manthani పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 2016లో నిర్మించిన పార్వతి బ్యారేజ్ కరకట్ట ప్రమాదకర స్థితికి చేరుకుందని స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా వరదలు, భారీ వర్షాల ఉధృతితో కరకట్ట పలు చోట్ల కుంగిపోవడంతో పాటు దెబ్బతింటున్నప్పటికీ ఇప్పటివరకు శాశ్వత మరమ్మత్తు పనులు చేపట్టలేదని వారు ఆరోపించారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు బ్యారేజీలోకి చేరితే ప్రస్తుతం బలహీనంగా ఉన్న కరకట్ట పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలిపారు. అలా జరిగితే బ్యారేజ్ పరిసర ప్రాంతాల్లోని సుమారు ఆరు గ్రామాలు నీట మునిగే అవకాశం ఉండటంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన మోరంచవాగు ఘటనలాంటి పరిస్థితి ఇక్కడ కూడా తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రమాదం సంభవించే ముందే ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి కరకట్టకు రక్షణ గోడలు నిర్మించడంతో పాటు శాశ్వత మరమ్మత్తు పనులు చేపట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.




