Sultanabad: సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

Sultanabad: సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం.

Srimanthula Kondal, Peddapalli
Published on: 5 Aug 2026 5:55 PM IST
Sultanabad
X

Sultanabad: సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

​సుల్తానాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందేలా వైద్యాధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం రోజున ఆయన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

​ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ విభాగం, వార్డులు, ప్రసూతి విభాగం, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే వైద్యాధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

​కలెక్టర్ సూచనలు & ఆదేశాలు:

సమయపాలన పాటించాలి: వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో సమయపాలన పాటిస్తూ, రోగులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి.

​ఓపీ, ప్రసవాలు పెరగాలి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ల (OP) సంఖ్యను పెంచడంతో పాటు, కాన్పులన్నీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

​గర్భిణుల నిరంతర పర్యవేక్షణ: ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు గర్భిణులను క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాలి. ముఖ్యంగా 'హైరిస్క్' గర్భిణులను ప్రత్యేకంగా గుర్తించి పర్యవేక్షించాలి.

​పరిశుభ్రత తప్పనిసరి: వార్డులు, మరుగుదొడ్లు, ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.

​రిఫరల్స్ తగ్గించాలి: వీలైనంత వరకు స్థానికంగానే నాణ్యమైన చికిత్స అందించి, ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయడాన్ని తగ్గించాలి. రోగులకు అవసరమైన మందులు, ల్యాబ్ పరీక్షలు సకాలంలో అందుబాటులో ఉండాలి.

​ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా ప్రతి ఉద్యోగి సేవాభావంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమం లో వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story