Peddapalli: విద్యార్థుల హామీలు నెరవేర్చాలని BRS భారీ ర్యాలీ
Peddapalli: విద్యార్థుల హామీలు విస్మరించారంటూ పెద్దపల్లిలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
Peddapalli: విద్యార్థుల హామీలు నెరవేర్చాలని BRS భారీ ర్యాలీ
పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నేతృత్వంలో వందలాది మంది విద్యార్థులు, బీఆర్ఎస్ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని కమాన్, జెండా, పెద్ద మసీదు, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది.
ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్ మెంట్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీనివల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ఇంటర్ దాటిన విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు నెలకు రూ. 4000 నిరుద్యోగ భృతి, మొదటి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ వంటి హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. 1000 రోజులు గడిచినా ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, విద్యార్థి విభాగం నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.




